Home తెలంగాణ ఇంద్రమ్మ ఇళ్ల పర్మిషన్లలో లంచాల వసూళ్లు?

ఇంద్రమ్మ ఇళ్ల పర్మిషన్లలో లంచాల వసూళ్లు?

97
0
  • పంచాయతీ కార్యదర్శిపై గ్రామస్తుల ఆరోపణలు
  • పింఛన్లు, పర్మిషన్ల పేరుతో డబ్బులు డిమాండ్
  • ఫోన్‌పే లావాదేవీలు ఆధారాలుగా చూపుతున్న బాధితులు మానకొండూర్, ఆర్గాన్ న్యూస్, మార్చి 31:

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం రాజాపూర్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి మహబూబ్ పాషాపై లంచాల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇంద్రమ్మ ఇళ్ల పర్మిషన్లు మంజూరు చేయడంలో, అలాగే పింఛన్లు కల్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారని గ్రామస్తులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.
పర్మిషన్ల మంజూరులో ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తూ, కొన్ని సందర్భాల్లో నేరుగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. లంచం ఇవ్వని వారి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచుతున్నారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గ్రామంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలు ప్రభుత్వ పథకాలపై ఆధారపడి ఇళ్ల నిర్మాణానికి ప్రయత్నిస్తుండగా, ఈ విధమైన వసూళ్లు వారికి భారంగా మారుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక, ఫోన్‌పే ద్వారా పంపిన డబ్బుల లావాదేవీల వివరాలను బాధితులు ఆధారాలుగా చూపిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఎంపీఓ కాసాగోని ప్రభాకర్ ప్రాథమిక విచారణ చేపట్టగా, పలువురు బాధితుల నుండి వివరాలు సేకరించారు. ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆయన తెలిపారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రయోజనాలు నిజమైన లబ్ధిదారులకు పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.