Home Uncategorized రైతుబంధు తొలి లబ్ధిదారు సంజీవరెడ్డి కన్నుమూత

రైతుబంధు తొలి లబ్ధిదారు సంజీవరెడ్డి కన్నుమూత

16
0

హుజురాబాద్, ఆర్గాన్ న్యూస్, మార్చి 18:

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం ధర్మరాజుపల్లి గ్రామానికి చెందిన రైతు మూగల సంజీవరెడ్డి (82) బుధవారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతుబంధు పథకాన్ని రాష్ట్రంలోనే తొలిసారిగా అందుకున్న రైతుగా సంజీవరెడ్డి చరిత్రలో నిలిచారు. అప్పటి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సమక్షంలో తొలి రైతుబంధు చెక్కును స్వీకరించిన ఘనత ఆయనకే దక్కింది. ఆ సందర్భం రాష్ట్రవ్యాప్తంగా ప్రాధాన్యత పొందింది.
సంజీవరెడ్డి ప్రజా జీవితంలో కూడా విశేష సేవలు అందించారు. 1981లో ధర్మరాజుపల్లి గ్రామ తొలి సర్పంచ్‌గా ఎన్నికై గ్రామ అభివృద్ధికి పునాదులు వేశారు. విత్తన సంఘం స్థాపకుడిగా, రైతు సేవ పొదుపు సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తూ స్థానిక రైతులకు అండగా నిలిచారు. నిబద్ధత గల నాయకుడిగా, వివాదరహిత వ్యక్తిగా గ్రామంలో, మండల స్థాయిలో మంచి పేరు సంపాదించుకున్నారు.
సంజీవరెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, గ్రామస్థులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం ధర్మరాజుపల్లి గ్రామానికి, రైతు సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు.