- మిర్యాలగూడలో ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ అమలు
- 500 మంది ద్విచక్ర వాహనదారులకు ఉచిత హెల్మెట్ల పంపిణీ
మిర్యాలగూడ ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, జనవరి 10:
మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పి క్యాంప్ గ్రౌండ్ నందు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్, డీఎస్పీ రాజశేఖర్ రాజు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో పట్టణంలోని దాదాపు 500 మంది ద్విచక్ర వాహనదారులకు ఉచిత హెల్మెట్లు పంపిణీ చేశారు. అనంతరం హెల్మెట్లు ధరించిన ద్విచక్ర వాహనదారులతో కలిసి పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
కార్యక్రమంలో ప్రసంగించిన నాయకులు మాట్లాడుతూ, ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పిలుపునిచ్చారు. హెల్మెట్ వాడకం ద్వారా వాహనదారుల ప్రాణాలతో పాటు వారి కుటుంబ సభ్యుల భద్రత కూడా కాపాడబడుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా, హెల్మెట్లు ధరించడం వల్ల కాలుష్య ప్రభావం నుంచి కూడా కొంత మేర రక్షణ పొందవచ్చని తెలిపారు.
ఇకపై హెల్మెట్ ధరించని వాహనదారులకు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ సరఫరా చేయకుండా పకడ్బందీగా అమలు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గ పోలీస్ సిబ్బంది, ద్విచక్ర వాహనదారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








