Home తెలంగాణ రైతుల ప్రాణాలకు ముప్పుగా విద్యుత్ తీగలు.. స్పందించని అధికారులు

రైతుల ప్రాణాలకు ముప్పుగా విద్యుత్ తీగలు.. స్పందించని అధికారులు

15
0
  • వ్యవసాయ భూములపై వేలాడుతున్న విద్యుత్ తీగలు.. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం మానకొండూర్, ఆర్గాన్ న్యూస్, మే 29:

సాగు పనులు ఊపందుకున్న తరుణంలో పొలాల మధ్య ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలు రైతుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామంలోని ట్రాన్స్‌ఫార్మర్ నంబర్ సిహెచ్ఎల్ /188 పరిధిలో ఉన్న వ్యవసాయ బావుల మీదుగా వెళ్లే విద్యుత్ తీగలు ప్రమాదకర స్థాయిలో కిందికి జారిపోవడంతో రైతులు ప్రాణభయంతో వ్యవసాయ పనులు కొనసాగిస్తున్నారు.
కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ తీగలు చేతితో అందుకునేంత ఎత్తులో ఉండటంతో ట్రాక్టర్లు, రోటావేటర్లు, ఇతర వ్యవసాయ యంత్రాలను పొలాల్లోకి తీసుకెళ్లడం కష్టంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వీచిన ఈదురుగాలుల ప్రభావంతో తీగలు మరింత కిందికి వాలిపోవడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారిందని చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో పొలాల్లో పని చేయాల్సి వస్తే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న భయం వెంటాడుతోందని పేర్కొంటున్నారు.
ప్రస్తుతం దున్నే పనులు సాగుతున్న నేపథ్యంలో రైతులు, వ్యవసాయ కూలీలు ప్రాణాలను పణంగా పెట్టుకుని పనులు చేస్తున్న పరిస్థితి నెలకొంది. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా భారీ ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందని గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు.
ఈ సమస్యపై పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు మండిపడుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించే బదులు ముందస్తుగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ తీగలను సురక్షిత ఎత్తులో బిగించడం, అవసరమైన చోట్ల అదనపు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడం, పాడైన లైన్లను మరమ్మతు చేయడం ద్వారా ప్రమాదాలను నివారించాలని కోరుతున్నారు.
“పొలాల్లో పని చేసేందుకు కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది. రైతులు, కూలీలు భయాందోళనలు లేకుండా వ్యవసాయ పనులు చేసుకునేలా అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలి” అని గ్రామ రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.