Home ఎడిటోరయిల్‌, ఆర్గాన్ న్యూస్ అవని… జనని… ప్రేరణి…

అవని… జనని… ప్రేరణి…

34
0

స్త్రీ శక్తి అజరామరం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం
ఆర్గాన్ న్యూస్ ప్రతినిధి – రంగారెడ్డి:

సృష్టికి మూలం ‘అమ్మ’

యుగయుగాలుగా తరతరాలుగా ఈ సృష్టిని ముందుకు నడిపిస్తున్న మహత్తర శక్తి స్త్రీ. స్త్రీ మహిమను మాటల్లో పూర్తిగా వర్ణించడం అసాధ్యం. సమాజం పురుషాధిక్యంగా కనిపించినా ఆ పురుషులందరికీ జన్మనిచ్చింది ఒక తల్లే. రాజాధి రాజైన వాడు కూడా ఒక తల్లి బిడ్డే. ఈ భూమిపై ఏ జీవి పుట్టాలన్నా “అమ్మ” అనే పవిత్రమైన శక్తి తప్పనిసరి.

అనేక పాత్రలు… ఒకే మహత్తర శక్తి

స్త్రీ జీవితం అనేక పాత్రల సమాహారం. ఆమె ఒక తల్లి, భార్య, అక్క, వదిన, కోడలు, కూతురు, మనవరాలు… ఇలా ఎన్నో బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తుంది. కుటుంబాన్ని నిలబెట్టే శక్తి ఆమెది. దేవతలందరూ ఒకవైపు ఉంటే స్త్రీ శక్తి మరోవైపు నిలబడగలదని చెప్పడం అతిశయోక్తి కాదు.
“ముదితలు నేర్వగరాని విద్య గలదే” అన్నట్లు ఆడది తలచుకుంటే సాధించలేని ఘనకార్యం ఉండదు. ఇంటి అభివృద్ధి నుంచి సమాజ అభివృద్ధి వరకు ప్రతి విజయానికి కారకురాలు స్త్రీనే. “కలకంట కన్నీరొలికిన సిరి ఇంట నిలవదు” అనే సామెత కూడా మహిళ స్థానం ఎంత గొప్పదో తెలియజేస్తుంది.

ఆడపిల్లలకు సమాన అవకాశాలు అవసరం

ఆడపిల్లలను తల్లిదండ్రులు మగబిడ్డలతో సమానంగా విద్య, సంస్కారం, బాధ్యతలలో తీర్చిదిద్దితే వారు ఏ రంగంలోనైనా విజయాలు సాధిస్తారు. అవకాశాలు కల్పిస్తే మహిళలు అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరని చరిత్ర ఎన్నోసార్లు నిరూపించింది.

పురాణాలు చెప్పే పతివ్రతల గాథలు

మన పురాణాలు, చరిత్రలు స్త్రీల మహోన్నత గాథలతో నిండి ఉన్నాయి. సీత, తార, అహల్య, ద్రౌపది, సావిత్రి వంటి పతివ్రతలు భారత సంస్కృతికి ప్రతీకలు. వారి సహనం, ధర్మనిబద్ధత తరతరాలకు ఆదర్శంగా నిలిచాయి.

వీరనారుల ధైర్యసాహసాలు

స్త్రీలు కేవలం కుటుంబ బాధ్యతలకే పరిమితం కాలేదు. అవసరమైనప్పుడు ధైర్యసాహసాలతో దేశాన్ని కాపాడిన వీరనారులుగా కూడా నిలిచారు. ఝాన్సీ లక్ష్మీబాయి శత్రువులను చీల్చి చెండాడిన ధీరురాలు. రుద్రమదేవి, నాగమ్మ, మంచాల పద్మిని వంటి వీరనారులు చరిత్రలో తమ పౌరుషాన్ని చాటారు.

సమాజానికి మార్గదర్శకులైన మహిళలు

భారతదేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటిన మహిళలు అనేకమంది. దీనుల సేవకు జీవితాన్ని అంకితం చేసిన మదర్ తెరిసా, స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన సరోజినీ నాయుడు వంటి మహిళలు సమాజానికి ఆదర్శం.
అలాగే దేశాన్ని ధైర్యంగా నడిపించిన ఉక్కు మహిళగా పేరుగాంచిన మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కూడా మహిళా నాయకత్వానికి ప్రతీకగా నిలిచారు.

తల్లి – తొలి గురువు

గర్భస్థ పిండ దశలోనే అభిమన్యుడు పద్మవ్యుహ రహస్యాన్ని వినిపించి గుర్తుంచుకున్నట్లు, తల్లి ఉపదేశం జీవితాంతం పిల్లలపై ప్రభావం చూపుతుంది. తల్లి తొలి గురువు. తరువాత గురువు విద్యార్థులకు వివిధ విద్యలలో నిష్ణాతులయ్యేలా శిక్షణ ఇస్తాడు.
ఈ ఇద్దరి ఉపదేశాల్లోనూ నిస్వార్థ ప్రేమ, ఉన్నతిని కాంక్షించే తత్వం దాగి ఉంటుంది.

భగవద్గీత ఇచ్చిన జీవన సందేశం

భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునికి ఇచ్చిన గీతోపదేశం ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచింది. కర్తవ్యాన్ని గుర్తుచేసే ఆ ఉపదేశం ప్రతి మనిషికి జీవన మార్గాన్ని చూపింది. సమస్యల సమయంలో ధైర్యంగా నిలబడే ఆత్మవిశ్వాసాన్ని అందించింది.

స్త్రీ అబల కాదు… అపార శక్తి

స్త్రీ “అబల” కాదు. ఆమె శక్తి, సహనం, ప్రేమ, త్యాగం, ధైర్యం కలిసిన మహోన్నత రూపం. దౌర్జన్యాలతో మహిళలను అణిచివేయాలని ప్రయత్నించే వారికి చరిత్ర ఎప్పటికప్పుడు సమాధానం చెబుతూనే ఉంటుంది.
ఈ భూమిపై జన్మించిన ప్రతి ఆడబిడ్డకు గౌరవం, సమానత్వం, అవకాశాలు కల్పించినప్పుడే సమాజం నిజమైన అభివృద్ధి సాధిస్తుంది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోని ప్రతి మహిళకు “ఆర్గాన్ న్యూస్” హృదయపూర్వక శుభాకాంక్షలు.