పేదలకు గూడు కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జీవితాల్లో కొత్త ఆశలకు నాంది
గ్రామీణ పేద కుటుంబాలకు భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం
రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క
ములుగు జిల్లా, ఆర్గాన్ న్యూస్, జూన్ :12
ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన అండగా నిలుస్తుందని పేదలకు గూడు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా గ్రామీణ పేద కుటుంబాల జీవితాల్లో కొత్త ఆశలకు నాంది పలుకుతున్నామని గ్రామీణ నిరుపేద కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం భరోసాగా నిలుస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు.శుక్రవారం మల్లంపల్లి మండలంలోని ముద్దునూరు తండ గ్రామంలో రూ.1 కోటి వ్యయంతో 30 ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత మంజూరు శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి హాజరయ్యారు. మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు భూమిపూజ నిర్వహించి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ ముద్దునూరు తండ గ్రామంలో మొదటి విడతలో 6 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని రెండో విడతలో పైలట్ ప్రాజెక్టు కింద 24 ఇండ్లను ఎంపిక చేసి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశామని తెలిపారు.ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని సర్వే నిర్వహించి అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే నూతన పెన్షన్ల పంపిణీ కూడా చేపడతామని తెలిపారు. స్థానిక అభివృద్ధి పనులు గ్రామ సమస్యలను స్థానిక గ్రామపంచాయతీ సర్పంచుల ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ప్రతి మహిళ తప్పనిసరిగా మహిళా సంఘాల్లో సభ్యురాలిగా చేరాలని మహిళా సంఘాల ద్వారా మహిళలకు అనేక ఆర్థిక సామాజిక ప్రయోజనాలు అందుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. మహిళలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని తెలిపారు.
మహిళలు సంఘాల్లో చేరితే ఇంట్లోనే ఒక బ్యాంక్ ఉన్నట్టేనని వ్యాఖ్యానించారు.తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పిలుపునిచ్చిన మంత్రి ప్రభుత్వం కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు నాణ్యమైన విద్య మెరుగైన ఫలితాలతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తోందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మంజూరు చేసిన ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రజా దర్బార్‌లో అందిన దరఖాస్తులను పరిశీలించి వెరిఫికేషన్ అనంతరం అర్హుల జాబితాను సిద్ధం చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఎఫ్‌వో వికాస్ మీనా అదనపు కలెక్టర్లు సి.హెచ్. మహేందర్ జి. ఎం. సంపత్ రావు గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి పంచాయతీరాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి పీఏసీఎస్ చైర్మన్ బొక్క సత్తిరెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి గ్రామాల సర్పంచులు స్థానిక ప్రజాప్రతినిధులు తహసీల్దార్ ఎంపీడీఓ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.









