- 36 గృహ సిలిండర్లు స్వాధీనం
- హోటళ్లు, దాబాల్లో ఆకస్మిక తనిఖీలు
- నిర్వాహకులపై 6A కేసులు
మిర్యాలగూడ ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, మార్చి 13:
మిర్యాలగూడ పట్టణంలో గృహ వినియోగ సిలిండర్ల అక్రమ వినియోగంపై సివిల్ సప్లై అమలు అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. పట్టణంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
తనిఖీల సమయంలో వాణిజ్య అవసరాలకు వినియోగించాల్సిన సిలిండర్ల స్థానంలో గృహ వినియోగ సిలిండర్లను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా అక్రమంగా వాడుతున్న 36 గృహ వినియోగ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన హోటల్ నిర్వాహకులపై అత్యావశ్యక వస్తువుల చట్టం ప్రకారం 6A కేసులు నమోదు చేసినట్లు సివిల్ సప్లై అధికారులు తెలిపారు. గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించడం చట్ట విరుద్ధమని, ఇలాంటి అక్రమాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని వారు హెచ్చరించారు.


