Home Adyatmikam మండమెలిగే పండుగతో మేడారం మహాజాతరకు ఘన ఆరంభం

మండమెలిగే పండుగతో మేడారం మహాజాతరకు ఘన ఆరంభం

16
0

ములుగు జిల్లా | ఆర్గాన్ న్యూస్ | జనవరి 21 :

దక్షిణ భారతదేశ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు ముందస్తు ఆచారంగా నిర్వహించే మండమెలిగే పండుగను ఆదివాసీ సంప్రదాయాలతో ఘనంగా చేపట్టారు. కన్నెపెళ్లి, కొండాయి, పూనుగొండ్ల గ్రామాల్లో ఈ పండుగ ఉత్సాహంగా జరిగింది.
ఈ సందర్భంగా ఆదివాసీ ఆడపడుచులు సమ్మక్క–సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల ఆలయాలను శుభ్రపరచి, గద్దెలను అలికి పసుపు–కుంకుమలతో అలంకరించారు. గ్రామ సరిహద్దుల్లో మామిడాకులు, బుర్రకాయలతో తోరణాలు కట్టి, కోడి పిల్లలతో సంప్రదాయ పూజలు నిర్వహించారు. మేళతాళాల మధ్య పండుగ సందడి నెలకొంది.
గ్రామ దేవతలైన బొడ్రాయి, మైసమ్మ, పోచమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మహాజాతర ఆరంభాన్ని సూచించారు. ఈ ఆచారాలు చేయడం వల్ల జాతర సమయంలో గ్రామ ప్రజలకు ఎలాంటి అపాయం జరగదని ఆదివాసీల విశ్వాసం.
ప్రధాన పూజారులు వడ్డెలు కుటుంబ సభ్యులతో కలిసి సమ్మక్క–సారలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనవరి 28 నుంచి 31 వరకు మహాజాతర నిర్వహించనుండగా, జాతర ముగిసిన అనంతరం తిరుగు వారం జరుగుతుందని పూజారులు తెలిపారు.