- ఆదివాసులకు ఒక న్యాయం, గిరిజనేతరులకు మరో న్యాయమా..?
- 1/70 చట్టానికి తూట్లు పొడుస్తున్నారు: పూనెం సాయి
ములుగు జిల్లా, మార్చి 13,ఆర్గాన్ న్యూస్:
ప్రభుత్వ భూములు రోజురోజుకూ అక్రమంగా కబ్జా అవుతున్నప్పటికీ వాటిని కాపాడడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గొండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి ఆరోపించారు.
వెంకటాపురం మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఆవరణలో గొండ్వానా సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
వెంకటాపురం మండలంలోని గ్రామ కంఠంలో ఉన్న ప్రభుత్వ భూములను గిరిజనేతరులు ఆక్రమిస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. అదే భూముల్లో ఆదివాసీలు గుడిసెలు వేసుకొని ఉంటే వెంటనే తొలగిస్తారని, కానీ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో అమల్లో ఉన్న 1/70 చట్టానికి విరుద్ధంగా గిరిజనేతరులు భూములను ఆక్రమించి విక్రయాలు చేస్తున్నా అధికారులు నిశ్శబ్దంగా ఉండటం అన్యాయమని ఆయన విమర్శించారు.
ఆదివాసులకు ఒక న్యాయం, ఆర్థికంగా మరియు రాజకీయంగా ప్రభావం ఉన్న గిరిజనేతరులకు మరో న్యాయం జరుగుతోందని ఆయన ధ్వజమెత్తారు. వెంకటాపురం గ్రామ కంఠంలో దాదాపు 100 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందని ఆయన పేర్కొన్నారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తి సుమారు 40 సెంట్ల భూమిని ఆక్రమించి ఫెన్సింగ్ వేసి విక్రయాలు చేస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం వెనుక ఏమి కారణమో స్పష్టం చేయాలని ప్రశ్నించారు.
ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడంతో ముడుపులు తీసుకుంటూ కాలయాపన చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పూనెం సాయి ఆరోపించారు.
ప్రభుత్వ భూములను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై కేసులు నమోదు చేయకుండా వారికి వత్తాసు పలకడం సరికాదని ఆయన హెచ్చరించారు.
జిల్లా అధికారులు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి వెంకటాపురం మండల కేంద్రంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించి తిరిగి ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ భూములను ప్రభుత్వ అవసరాలకు వినియోగించేందుకు ప్రభుత్వ బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మునేశ్వరావు, సూర్యం తదితరులు పాల్గొన్నారు.


