Home ఖమ్మం ద్వేష రాజకీయాలకు చెక్

ద్వేష రాజకీయాలకు చెక్

54
0
  • రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం ఖమ్మంలో ప్రజా ర్యాలీ
  • ప్రజాస్వామ్యానికి ప్రజల స్వరం: “షుక్రియా… షుక్రియా” నినాదాలతో ఉవ్వెత్తున స్పందన

ఖమ్మం| ఆర్గాన్ | జనవరి 1:

భాష, మతం, కులం, ప్రాంతం, లింగం పేరుతో సమాజంలో పెరుగుతున్న ద్వేష ప్రసంగాలు, ద్వేష నేరాలు దేశ ఐక్యతకు, ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్ర ముప్పుగా మారుతున్నాయని రాజ్యాంగ పరిరక్షణ వేదిక జాతీయ అధ్యక్షులు సయ్యద్ సాదిక్ అలీ పేర్కొన్నారు. ద్వేషానికి అడ్డుకట్ట వేయడం దేశ హితం కోసమేనని, రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ఆయన స్పష్టం చేశారు.

హేట్ స్పీచ్ & హేట్ క్రైమ్స్ నివారణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉత్తర్వు (GO) తీసుకురావాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ, రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలో శాంతియుత ప్రజా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ వర్గాలకు చెందిన ప్రజలు, యువత, మేధావులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు.

సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అసత్య ప్రచారం, విద్వేష వ్యాఖ్యలు సమాజంలో విభజనను పెంచుతున్నాయని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. భావప్రకటన స్వేచ్ఛను అడ్డం పెట్టుకుని ద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేశారు. ర్యాలీని ఉద్దేశించి సయ్యద్ సాదిక్ అలీ మాట్లాడుతూ,
“రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించింది. ద్వేష ప్రసంగాలు ఆ రాజ్యాంగ ఆత్మను దెబ్బతీస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంపై తీసుకుంటున్న ముందడుగు ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. దేశం బాగు కోసం మీరు ఆలోచిస్తే, దేశ ప్రజలు మీకోసం ఆలోచిస్తారు” అని అన్నారు.

ఖమ్మం నగరంలోని ప్రధాన రహదారుల గుండా సాగిన ఈ ర్యాలీ పోలీసు శాఖ సమన్వయంతో ఎక్కడా ఉద్రిక్తతలకు తావు లేకుండా శాంతియుతంగా కొనసాగింది. “వి ద్వేషానికి చోటు లేదు, రాజ్యాంగమే మా దారి”, “విభజన కాదు, సమైక్యత కావాలి” వంటి నినాదాలు ప్రజల్లో చైతన్యం నింపాయి.
ఈ ర్యాలీకి జర్నలిస్టులు, న్యాయవాదులు, విద్యావేత్తలు, పౌరహక్కుల కార్యకర్తలు మద్దతు తెలిపారు. హేట్ స్పీచ్‌పై చట్టం అవసరమే అయినప్పటికీ, మీడియా స్వేచ్ఛకు భంగం కలగకుండా, నిజమైన ప్రజాహిత విమర్శలను కట్టడి చేయకుండా స్పష్టమైన మార్గదర్శకాలతో చట్టం అమలవ్వాలని వారు సూచించారు.

అలాగే, హేట్ స్పీచ్ & హేట్ క్రైమ్స్ నివారణ దిశగా ముందడుగు వేసిన సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వ చర్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయని వక్తలు పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని గంభీరంగా పరిగణించి ప్రభుత్వ ఉత్తర్వు (GO) తీసుకురావడం అభినందనీయమన్నారు.

ర్యాలీ మొత్తం “షుక్రియా… షుక్రియా” నినాదాలతో మార్మోగింది. రాజ్యాంగ పరిరక్షణకు, దేశ హితం కోసం తీసుకునే బాధ్యతాయుత నిర్ణయాల పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని ఈ నినాదాలు ప్రతిబింబించాయని నిర్వాహకులు పేర్కొన్నారు. సమైక్యతే లక్ష్యంగా, రాజ్యాంగమే దారిగా సాగిన ఈ శాంతియుత ప్రజా ర్యాలీ ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక పాలేరు నియోజకవర్గం బాధ్యులు నజురుద్దీన్ తిరుమలాయపాలెం మండల అధ్యక్షులు సైదా కూసుమంచి మండల అధ్యక్షులు ఖలీమ్ కొండపల్లి అధ్యక్షులు సుభాని ఖమ్మం రూరల్ అధ్యక్షులు గౌస్ పాషా.. మత పెద్ద ఇమామ్ .అబ్దుల్ ఘని రాజ్యాంగ పరిరక్షణ వేదిక గౌరవ సలహాదారులు సయ్యద్ ఇస్మాయిల్ పెంటూ సాహెబ్. ఇబ్రహీం. అబ్దుల్ ఘని. హుస్సేన్. తదితరులు పాల్గొన్నారు.