- సర్పంచ్ ఎన్నికల్లో డబ్బుల వర్షం, వ్యవస్థల మౌనం మానకొండూర్, ఆర్గాన్ న్యూస్, డిసెంబర్ 19:
కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో జరిగిన గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే స్థాయికి చేరుకున్నాయి. గ్రామాభివృద్ధి, ప్రజాసేవ అనే మాటలు ఎన్నికల ప్రచారంలో కనిపించకుండాపోయి, నగదు–మద్యం–మద్యం పంపిణీనే ప్రధాన అజెండాగా మారింది. ఇది ఎన్నిక కాదు… బహిరంగంగా సాగిన ఓటు వేలంపాటే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఓటు అంటే హక్కు కాదు… కొనుగోలు సరుకు!
ఈ ఎన్నికల్లో ఓటు పవిత్రత పూర్తిగా తాకట్టు పడింది. ఒక్కో ఓటుకు రూ.500 నుంచి రూ.1500 వరకు నగదు, మద్యం, మాంసం పంపిణీ జరగగా, కొన్నిచోట్ల రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు బేరసారాలు సాగినట్లు బహిరంగంగానే చర్చ జరుగుతోంది. ప్రజాస్వామ్యంలో ఓటు ప్రజల శక్తి అయితే, ఇక్కడ అది బేరం సరుకుగా మారిపోయిందన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి.
ఇజ్జత్ పేరుతో అప్పుల రాజకీయం
ప్రత్యర్థి ఎంత ఖర్చు పెడుతున్నాడో చూసి మరింతగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అభ్యర్థులపై వచ్చింది. “ఇజ్జత్ కా సవాల్” అంటూ పొలాలు, బంగారం తాకట్టు పెట్టి మరీ డబ్బులు వెచ్చించారు. గెలుపు వస్తే పదవి… ఓడితే జీవితాంతం అప్పుల భారం మోయాల్సిన దుస్థితికి అభ్యర్థుల కుటుంబాలు నెట్టబడ్డాయి. ఇది రాజకీయ పోటీ కాదు… అప్పుల ఆత్మహత్యలకే బాట వేసే వ్యవస్థగా మారుతోందన్న ఆవేదన వ్యక్తమవుతోంది.
మద్యం–మాంసం రాజకీయాలే ప్రచారం
ఓటింగ్‌కు రెండు రోజుల ముందే ఇంటింటికి మద్యం, మాంసం పంపిణీ జరగడం గ్రామాల్లో సాధారణంగా మారింది. అభివృద్ధి హామీలకు బదులు మద్యం సీసా, మాంసం ముక్క చేతిలో పెట్టి ఓటు అడగడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటుగా మారింది. సర్పంచ్ అభ్యర్థులే కాదు, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసినవారు కూడా ఇదే బాటలో నడవడం పరిస్థితి ఎంత దిగజారిందో స్పష్టం చేస్తోంది.
పార్టీల ప్రతిష్ఠ పేరుతో డబ్బుల మోత
స్థానిక సంస్థల ఎన్నికలను అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో గ్రామస్థాయిలో డబ్బుల ప్రవాహం పెరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ మద్దతుతో నిలిచిన అభ్యర్థులు గెలవాలనే ఉద్దేశంతో అనుచరులను రంగంలోకి దింపడమే కాకుండా, ఆర్థికంగా చేయూతనిచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ ఉనికి పేరుతో ప్రజాస్వామ్యాన్ని తాకట్టు పెట్టడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఎన్నికల యంత్రాంగం ఎక్కడ?
డబ్బులు, మద్యం పంపిణీపై బహిరంగంగా చర్చ జరుగుతున్నా, ఎన్నికల అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లే ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్లయింగ్ స్క్వాడ్లు, వీడియో నిఘా బృందాలు ఏమయ్యాయన్న ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి. ఎన్నికల నియమావళి కాగితాలకే పరిమితమైందా? లేక అధికారుల కళ్లముందే ఇవన్నీ జరిగాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పదవి కాదు… శాపంగా మారిన సర్పంచ్ సీటు
సర్పంచ్ పదవితో వచ్చే అధికారాలు, వసతులు పరిమితమైనవే అయినా, రాజకీయ గొప్పల కోసం ఉద్యోగుల భార్యలను కూడా బరిలో నిలిపిన పరిస్థితులు కనిపించాయి. గతంలో అప్పుల నుంచి బయటపడలేక కొందరు సర్పంచ్‌లు తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన దుర్ఘటనలు ఉన్నప్పటికీ, అదే చరిత్ర మళ్లీ పునరావృతమవుతున్నది.
గెలిస్తే హంగామా… ఓడితే నిస్సహాయత
తాజా ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులు “లక్షలు ఖర్చు పెట్టాం… చివరకు చేతిలో చిప్పలే మిగిలాయి” అంటూ లబోదిబోమంటున్నారు. అప్పుల వడ్డీలు, కుటుంబాలపై పడుతున్న ఒత్తిడి గ్రామాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మానకొండూరు నియోజకవర్గంలో జరిగిన ఈ ఎన్నికలు గ్రామ రాజకీయాల్లో డబ్బుల సంస్కృతి ఎంత ప్రమాదకరంగా మారిందో, ప్రజాస్వామ్యం ఏ స్థాయిలో దిగజారిందో ప్రశ్నిస్తోంది.








