Home POLITICS కల్లూరు గడ్డపై కాషాయ సునామీ

కల్లూరు గడ్డపై కాషాయ సునామీ

67
0
  • మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ భారీ శక్తి ప్రదర్శన
  • పొంగులేటి సుధాకర్ రెడ్డి

కల్లూరు,ఆర్గాన్ న్యూస్, ఫిబ్రవరి 6 :

కల్లూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన భారీ ర్యాలీ కల్లూరు పట్టణాన్ని కాషాయ సునామీలా కదిలించింది. జనసంద్రంగా మారిన పురవీధుల్లో యువత డప్పులు, తీన్మార్ డాన్సులతో ఉత్సాహంగా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో బీజేపీ జాతీయ నాయకులు, కర్ణాటక–తమిళనాడు రాష్ట్రాల కో ఇన్‌చార్జి మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు ఈ మున్సిపల్ ఎన్నికలే సరైన గుణపాఠం అవుతాయని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం పంపుతున్న నిధులకు రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకుని ఘనకార్యంగా చెప్పుకుంటోందని, అమృత్, స్వచ్ఛ భారత్, పీఎం ఆవాస్ యోజన నిధులను దారి మళ్లిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీల డీఎన్‌ఏ ఒక్కటేనని, కుటుంబ రాజకీయాలే వారి లక్ష్యమని విమర్శించారు.
కల్లూరు అభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ అవసరమని, కల్లూరు గడ్డపై ఎగిరేది మోడీ జెండాయేనని స్పష్టం చేశారు. ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే అవినీతి, అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.