Home agriculture రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలను మాత్రమే సరఫరా చేయాలి

రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలను మాత్రమే సరఫరా చేయాలి

14
0
  • జిల్లా కలెక్టర్ అంకిత్
  • వానాకాలం ఎరువులు, విత్తనాలు సన్నద్ధతపై జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ సమావేశం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, మే 6:

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల రైతుల వారోత్సవంలో భాగంగా విత్తనాలు, ఎరువుల డీలర్లకు అవగాహన, వానాకాలం సీజన్‌కు సంబంధించిన ఎరువుల సన్నద్ధతపై జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ సమావేశం బుధవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అంకిత్ అధ్యక్షతన నిర్వహించబడింది. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, సంబంధిత శాఖల అధికారులు, విత్తనాలు మరియు ఎరువుల డీలర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 6,59,743 ఎకరాల్లో సాగు కొనసాగుతుందని తెలిపారు. ఇందులో సుమారు 2.25 లక్షల ఎకరాల్లో పత్తి, 1 లక్ష ఎకరాల్లో మొక్కజొన్న, 1.75 లక్షల ఎకరాల్లో వరి పంటలు సాగు అవుతున్నాయని వివరించారు. గత సంవత్సరం జిల్లాలో అధిక దిగుబడులు సాధించామని, ఈ వానాకాలంలో కూడా అదే స్థాయిలో ఉత్పత్తి లక్ష్యంగా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.
రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. రైతుల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ప్రతి డీలర్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, గుర్తింపు పొందిన సంస్థల నుంచే విత్తనాలు, ఎరువులను సేకరించి ప్రభుత్వ నిర్దేశించిన ధరలకు పారదర్శకంగా విక్రయాలు జరపాలని ఆదేశించారు. ఎరువుల కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు విక్రయించడం వంటి అక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తావు ఉండకూడదన్నారు.

నకిలీ- నాణ్యతలేని విత్తనాలు సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు

ఎరువుల నిల్వలు, సరఫరాపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని పేర్కొంటూ జిల్లా మరియు మండల స్థాయి అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి యూరియా సహా ఇతర ఎరువుల నిల్వలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నకిలీ విత్తనాలు, నాణ్యత లేని ఎరువులు సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఎరువుల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు.

జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ

విత్తనాలు, ఎరువుల సరఫరా ఎంతో సున్నితమైన అంశమని, డీలర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించి కొరత రాకుండా చూడాలని సూచించారు. జిల్లా అంతర్రాష్ట్ర సరిహద్దులో ఉండటంతో పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ నుండి రైతులు ఇక్కడికి వచ్చి ఎరువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. తక్కువ ధరకు లభిస్తాయని భావించి నాణ్యత లేని విత్తనాలు కొనుగోలు చేసే పరిస్థితులు ఉండవచ్చని, అలాంటి ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎక్కడైనా అనుమానాస్పదంగా విత్తనాలు లేదా ఎరువుల విక్రయాలు జరుగుతున్నట్లయితే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. గత సంవత్సరంలో జిల్లాలో ఐదు నకిలీ విత్తనాల కేసులు నమోదయ్యాయని, ఈసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు ఎరువుల వినియోగం, నిల్వ, నాణ్యత ప్రమాణాలు, స్టాక్ నిర్వహణ, ఆన్‌లైన్ నమోదు విధానాలపై డీలర్లకు సమగ్ర అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు విత్తనాలు ఎరువుల డీలర్లు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.