- పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు : ఆకుల నరసన్న కరీంనగర్, ఆర్గాన్ న్యూస్, మే 15:
కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో వరి, మొక్కజొన్న ధాన్యం కొనుగోళ్లు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతున్నాయని మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా నిర్వహిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
శుక్రవారం మార్కెట్ యార్డును సందర్శించిన ఆకుల నరసన్న అక్కడి పరిస్థితులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. యార్డులో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. రెండు నుంచి మూడు రోజుల్లో మార్కెట్ యార్డ్ మొత్తం క్లీనింగ్ పూర్తి చేయాలని సూచించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు ధాన్యం తీసుకువచ్చే సమయంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలను కల్పిస్తూ కొనుగోలు ప్రక్రియను మరింత సమర్థవంతంగా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.
కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఆకుల నరసన్న స్పష్టం చేశారు. ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తోందని, ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి జాప్యం లేదన్నారు.
చివరి గింజ వరకూ ప్రభుత్వం వరి, మొక్కజొన్నను కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. రైతుల ప్రయోజనాలకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను నమ్మవద్దని, ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని ఆకుల నరసన్న పేర్కొన్నారు. మార్కెట్ యార్డులో రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు నిరంతరం చర్యలు కొనసాగిస్తున్నామని తెలిపారు.









