Home తెలంగాణ మున్సిపల్ కార్మికులకు ప్రత్యేక వైద్య కేంద్రం

మున్సిపల్ కార్మికులకు ప్రత్యేక వైద్య కేంద్రం

17
0
  • సిబ్బందికి రూ.30 లక్షల ప్రమాద బీమా
  • జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్, ఆర్గాన్ న్యూస్, డిసెంబర్ 2:

కరీంనగర్ మున్సిపల్ కార్మికుల ఆరోగ్యం, సంక్షేమం పట్ల జిల్లా యంత్రాంగం మరింత దృష్టి సారించింది. వారధి సొసైటీ సహకారంతో మున్సిపల్ కార్మికులకు పిపీఈ కిట్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయితో కలిసి కార్మికులకు రక్షణ కిట్లను అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ… మున్సిపల్ కార్మికులు విధుల్లో తప్పనిసరిగా పిపీఈ కిట్లు ధరించాలని, ఆరోగ్య నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్న మున్సిపల్, పంచాయతీ సిబ్బందితో పాటు శానిటేషన్ వర్కర్లు, ఎలక్ట్రిసిటీ కార్మికులు, జవాన్లు, ఇన్స్పెక్టర్లందరికీ రూ.30 లక్షల ప్రమాద బీమా కల్పించినట్లు తెలిపారు. ఈ బీమా ప్రీమియంను జిల్లా యంత్రాంగం తరఫున ప్రభుత్వం ఇప్పటికే చెల్లిస్తోందని వివరించారు.
కార్మికుల శ్రేయస్సు కోసం ప్రత్యేక వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కేంద్రంలో వైద్యుడు సహా మందులు, ప్రాథమిక చికిత్స సదుపాయాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ వైద్య సేవలను వినియోగించుకోవచ్చని తెలిపారు.
మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ… కార్మికుల సంక్షేమం కోసం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు. కార్మికులు తమ కేవైసీ వివరాలు సమర్పించాలని సూచించారు. ప్రతి నెలా ఈఎస్ఐ చందాలు చెల్లిస్తున్నామని, అనారోగ్య కారణంగా సెలవుల్లో ఉన్న వారు ఈఎస్ఐ ద్వారా జీతాలు పొందవచ్చని వివరించారు. అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులు మెడికల్ ఇన్ వాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు.
కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు ఖాదర్ మొహినుద్దీన్, వేణుమాధవ్, మెడికల్ ఆఫీసర్ సుమన్, వారధి సొసైటీ మెంబర్ సెక్రటరీ ఆంజనేయులు పాల్గొన్నారు.