Home Uncategorized ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

14
0

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి ,ఆర్గాన్ న్యూస్ ప్రతినిధి , మార్చ్ 6:

99 రోజుల ప్రజా పాలన ప్రగతి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మొదటి థీమ్ అయిన “పరిశుభ్రత” కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి శుక్రవారం ప్రారంభించారు.
అంతకుముందు అంబేద్కర్ చౌరస్తా నుంచి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు అధికారులు,ప్రజా ప్రతినిధులు విద్యార్థులతో కలిసి పరిశుభ్రత అవగాహన ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ మాధవి ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ర్యాలీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానానికి చేరుకుని అక్కడ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ, “99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక”లో భాగంగా నేటి నుంచి మార్చి 15వ తేదీ వరకు కొనసాగనున్న పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్‌పై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అలాగే అధికారులు తమ తమ కార్యాలయాల్లో ఉన్న పెండింగ్ ఫైల్స్‌ను త్వరితగతిన క్లియర్ చేయాలని ఆదేశించారు.
త్వరలో వానాకాలం ప్రారంభమయ్యే నేపథ్యంలో నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి వాటిని శుభ్రం చేయాలని సూచించారు. మురుగు కాలువలు శుభ్రపరిస్తే దోమలు పెరగకుండా నిరోధించి వ్యాధులను దూరం చేయవచ్చని తెలిపారు. ఈ పది రోజులలో మురుగు కాలువలతో పాటు రోడ్లను కూడా పరిశుభ్రంగా ఉంచే చర్యలు తీసుకుంటామని చెప్పారు. పరిశుభ్రత మరియు ఫైల్స్ క్లియరెన్స్‌పై చేపట్టిన ఈ పది రోజుల ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా మార్చి నెల ఆర్థిక సంవత్సరానికి చివరి నెల కావడంతో మున్సిపాలిటీల ఆదాయం పెంచేందుకు పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పరిశుభ్రతపై అందరితో ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) ఖిమ్యా నాయక్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డీపీఆర్‌ఓ సీతారాం, డీవైఎస్ఓ సుధీర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.