- పోతినేని సుదర్శన్ రావు సిపిఎం రాష్ట్ర నాయకులు
ఖమ్మం, ఆర్గాన్ న్యూస్, మార్చి 4:
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం పై జరుగుతున్న దుష్ప్రచారాలను పార్టీ శ్రేణులు, ప్రజలు నమ్మవద్దని సీపీఎం రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్ రావు విజ్ఞప్తి చేశారు.
గత మూడు రోజులుగా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా మరియు కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో తమ్మినేని వీరభద్రంపై తీవ్రమైన తప్పుడు కథనాలు ప్రచారం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. పార్టీ తరఫున ఎలాంటి చర్చా, చర్యా జరగలేదని స్పష్టం చేశారు.
తమ్మినేని వీరభద్రం పార్టీ ఆఫీసు నిర్మాణం, ఛానల్ ప్రారంభం వంటి అంశాలపై చేస్తున్న ఆరోపణలు అసత్యమని తెలిపారు. ఆయనపై సస్పెన్షన్, బహిష్కరణ వంటి చర్యలు తీసుకున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఖండించారు.
పార్టీ కార్యాలయం హైటెక్ కార్యాలయం కాదని, అక్కడ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు వసతి సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. “బోడెపూడి విజ్ఞాన కేంద్రం” పేరుతో పేదలకు వైద్య సౌకర్యాలు అందిస్తూ ప్రతి నెలా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అలాగే మహిళలకు టైలరింగ్ శిక్షణ వంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.
కొంతమంది ఉద్దేశపూర్వకంగా పార్టీకి నష్టం కలిగించే విధంగా ఈ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా కొన్ని యూట్యూబ్ ఛానళ్లు పోటీపడి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. ఈ రకమైన గోబెల్స్ ప్రచారాలను పార్టీ శ్రేణులు, ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, దళితులు, గిరిజనులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న పార్టీ సీపీఎం అని, అలాంటి పార్టీపై దుష్ప్రచారం చేయడం దురుద్దేశపూర్వకమని పేర్కొన్నారు. ముఖ్యంగా తమ్మినేని వీరభద్రంపై పార్టీలో ఎలాంటి వ్యతిరేకపు చర్చా, చర్యా జరగలేదని స్పష్టం చేస్తూ, తప్పుడు ప్రచారాలను ఖండిస్తున్నట్లు పోతినేని సుదర్శన్ రావు తెలిపారు.


