Home agriculture “రైతులను గాలికొదిలేసిన ప్రభుత్వం.. వెంటనే వడ్లు కొనాలి”

“రైతులను గాలికొదిలేసిన ప్రభుత్వం.. వెంటనే వడ్లు కొనాలి”

20
0
  • అకాల వర్షాలతో తడిసిన ధాన్యానికి పరిహారం ఇవ్వాలి
  • 25 రోజులు గడిచినా రెండు లారీలే రావడం ప్రభుత్వ వైఫల్యం
  • వడ్లు కొనకపోతే కలెక్టరేట్ల ముట్టడికి బీఆర్‌ఎస్ హెచ్చరిక

ములుగు, ఆర్గాన్ ప్రతినిధి , మే 22:

రాష్ట్ర ప్రభుత్వం రైతులను పూర్తిగా గాలికొదిలేసిందని, కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ బడే నాగజ్యోతి తీవ్రస్థాయిలో డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు.
శుక్రవారం ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో గత పదిహేను రోజులుగా ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయని, లారీలు అందుబాటులో లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 25 రోజులు గడిచినా ఇప్పటివరకు కేవలం రెండు లారీలు మాత్రమే రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆమె విమర్శించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయిందని, రైతులు మళ్లీ ఎండబెట్టి సిద్ధం చేసినప్పటికీ ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం రైతాంగాన్ని మోసం చేయడమేనని ఆరోపించారు.
ఈ సందర్భంగా మాజీ రెడ్కో చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు మహబూబాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వై సతీష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. “రైతులపై ఈ ప్రభుత్వానికి కనికరం లేదా?” అంటూ ప్రశ్నించారు.
రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని ఆరబెట్టగా వర్షానికి మళ్లీ తడిసిపోయిందని, తీవ్ర నష్టాలతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించకపోతే రైతుల పక్షాన బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ధాన్యం కొనుగోళ్లపై ఇప్పటివరకు ఒక్కసారి కూడా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారా? ఒక్క మంత్రి అయినా జిల్లాల్లో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకున్నారా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలు, రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉండి రైతుల బాధలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎయిర్ కండిషన్ గదుల్లో కూర్చొని అబద్ధాలు చెబుతున్నారని, క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచులే కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొనడం ప్రభుత్వ పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమన్నారు.

ఈ కార్యక్రమంలో వెంకటాపూర్ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు లింగాల రమణారెడ్డి, ములుగు మండల మాజీ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కుమార్, జిల్లా సీనియర్ నాయకులు, మాజీ సర్పంచులు, పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.