- ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడొద్దు : రాజకీయ పక్షాల జేఏసీ హెచ్చరిక
- ఆరు నెలల్లో సమస్య పరిష్కరిస్తామన్న అధికారులు కరీంనగర్, ఆర్గాన్ న్యూస్, మే 25:
కరీంనగర్ నగర ప్రజలను సంవత్సరాలుగా వేధిస్తున్న డంప్ యార్డ్ సమస్యపై రాజకీయ పక్షాల జేఏసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. డంప్ యార్డ్ నుంచి వెలువడుతున్న పొగ, దుర్వాసనతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని, చిన్నపిల్లలు, వృద్ధులు శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
సిపిఐ, సిపిఎం, బీఆర్ఎస్, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి, గుడికందుల సత్యం, జంగిలి ఐలందర్ యాదవ్, జిందం ప్రసాద్, కొక్కిరాల సత్యరావు ఆధ్వర్యంలో ప్రజావాణిలో ఎస్‌ఈ రాజ్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. డంప్ యార్డ్ సమస్యను వెంటనే పరిష్కరించి నగర ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు డంప్ యార్డ్ తొలగింపుపై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలను పూర్తిగా విస్మరిస్తున్నాయని మండిపడ్డారు. గత ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేశామని చెప్పుకున్నా సమస్యను శాశ్వతంగా పరిష్కరించలేకపోయాయని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా పరిశీలన పేరుతో కాలయాపన చేస్తోందని ఆరోపించారు.
డంప్ యార్డ్ కారణంగా పరిసర ప్రాంత ప్రజలు నిత్యం భయాందోళనల మధ్య జీవిస్తున్నారని, వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాల కంటే ప్రభుత్వాలకు రాజకీయాలే ముఖ్యమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డంప్ యార్డ్‌ను నగరానికి దూరంగా తరలించాలని, లేకపోతే రాజకీయ పక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
వినతిపత్రానికి స్పందించిన మున్సిపల్ అధికారులు ఆరు నెలల్లో కరీంనగర్ నగరంలో డంప్ యార్డ్ సమస్యను పూర్తిగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విలీన గ్రామాల నుంచి వచ్చే చెత్తను ఆయా గ్రామాల పరిధిలోనే నిర్వహించే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు, బీర్ల పద్మ, కొట్టే అంజలి, మామిడిపల్లి హేమంత్, సిపిఎం నాయకులు పున్నం రవి, వినయ్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.







