- కలెక్టర్ అంకిత్
కొత్తగూడెం ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, ఏప్రిల్ 3:
జిల్లాలో జాతీయ జనగణన కార్యక్రమాన్ని సమగ్రంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. జనగణన ప్రక్రియలో ప్రతి ఇంటిని కవర్ చేస్తూ, ఎలాంటి లోపాలు లేకుండా ఖచ్చితమైన డేటా సేకరణ జరగాలని ఆయన అన్నారు .
జాతీయ జనగణన కార్యక్రమం భాగంగా ఏప్రిల్ 1 నుండి 3 వరకు జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో ఫీల్డ్ ట్రైనర్స్‌కు మూడు రోజులపాటు శిక్షణా తరగతులు నిర్వహించబడినట్లు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించబడగా, ఫీల్డ్ స్థాయిలో పని చేసే సిబ్బందికి అవసరమైన అన్ని అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు.
ఈ శిక్షణలో మాస్టర్ ట్రైనర్స్‌గా ఎన్. శివరామకృష్ణ, డాక్టర్ పి. సుస్మిత రజిని పాల్గొని, మొత్తం 34 మంది ఫీల్డ్ ట్రైనీస్‌కు జనగణన నిర్వహణ విధానం, హౌస్ సెన్సెస్, డేటా సేకరణలో పాటించాల్సిన జాగ్రత్తలు, డిజిటల్ పద్ధతుల వినియోగం తదితర అంశాలపై విపులంగా శిక్షణ అందించారు.
శిక్షణలో భాగంగా మూడవ రోజు పాలకోయ తండా ప్రాంతంలో ప్రాక్టికల్ డెమో నిర్వహించారు. ఫీల్డ్ ట్రైనీస్‌ను అవుట్ ఫీల్డ్‌కు తీసుకెళ్లి, ఇంటింటికి వెళ్లి సమాచారం సేకరించే విధానాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా మొదటి ఇంటిలో హౌస్ సెన్సెస్ కార్యక్రమాన్ని కలెక్టర్ అంకిత్ సమక్షంలో నిర్వహించారు. ఈ డెమో ద్వారా ఫీల్డ్ ట్రైనీస్‌కు ప్రత్యక్ష అనుభవం లభించింది.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జనగణనలో సేకరించే సమాచారం ప్రభుత్వ విధానాల రూపకల్పనకు ఎంతో కీలకమని అన్నారు . అందువల్ల ప్రతి వివరాన్ని శ్రద్ధగా నమోదు చేయాలని, ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా బాధ్యతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, వారికి అవసరమైన సమాచారం అందిస్తూ డేటా సేకరణ చేపట్టాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సెన్సెస్ జిల్లా అధికార సిబ్బంది, సి.పి.ఓ. సంజీవరావు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అనంతరం శిక్షణా కార్యక్రమం కొనసాగింది.


