Home ఎడిటోరయిల్‌, ఆర్గాన్ న్యూస్ మా ఇంట్లో పొయ్యి చల్లారింది

మా ఇంట్లో పొయ్యి చల్లారింది

12
0
  • ఇంధనం-గ్యాస్ కష్టాలతో సగటు కుటుంబాల విలవిల

మిర్యాలగూడ ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, మార్చి25:

“ఇంధనం సమృద్ధిగా ఉంది… గ్యాస్ కొరత లేదు” అని కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయిల్ కంపెనీలు చెబుతున్నా, నేలపై పరిస్థితులు మాత్రం పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాయి. సగటు కుటుంబాల జీవితం రోజురోజుకూ కష్టాల మయం అవుతోంది. ఉదయం పనులకు వెళ్లాల్సిన తండ్రి, పిల్లలను స్కూల్‌కు పంపాల్సిన తల్లి ఇద్దరికీ మొదటి అడ్డంకిగా ఇంధనం, గ్యాస్ కొరత మారింది. ఇంట్లో గ్యాస్ లేక పొయ్యి చల్లారిపోవడంతో వంటలు ఆగిపోయాయి. “పిల్లలకు టిఫిన్ పెట్టలేక, ఖాళీ కడుపుతోనే స్కూల్‌కు పంపిస్తున్నాం” అంటూ తల్లులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వేడి ఆహారం అందక ఆరోగ్యం మరింత క్షీణిస్తోంది.
గ్యాస్ బుకింగ్ కోసం ఫోన్‌లు కలవడం లేదు… ఎట్టకేలకు బుక్ చేసినా సిలిండర్ సమయానికి రాకపోవడంతో కుటుంబాల రోజువారీ జీవనం అస్తవ్యస్తమవుతోంది. మరోవైపు గ్యాస్ లేక హోటళ్లు, హాస్టళ్లు, చిన్న టిఫిన్ సెంటర్లు మూతపడటంతో అనేక కుటుంబాల ఆదాయం ఆగిపోయింది. “రోజు సంపాదిస్తేనే ఆ రోజు తింటాం… ఇప్పుడు సంపాదన లేదు, వంట లేదు” అనే బాధ ప్రతి ఇంట్లో వినిపిస్తోంది.
ఇదే సమయంలో పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్ద భారీ క్యూలు ఏర్పడుతున్నాయి. గంటల తరబడి వాహనదారులు క్యూలో నిలబడటంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. “ఒక రోజు పని మానేసి క్యూలో నిలబడ్డా, చివరికి పెట్రోల్ దొరకకపోతే మా కుటుంబం ఎలా బతుకుతుంది?” అంటూ కూలీలు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలు ఆగిపోతే ఉపాధి ఆగిపోతుంది అది నేరుగా కుటుంబాల పొట్టపై ప్రభావం చూపుతోంది. ప్రజల్లో మరింత ఆవేదన కలిగిస్తున్న విషయం ఈ కష్టాలు సాధారణ కుటుంబాలకే పరిమితమవుతున్నాయనే భావన. “మేమే ఓటు వేసాం… కానీ క్యూలో నిలబడేది కూడా మేమే. గెలిచిన వాళ్లు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు” అంటూ పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు గానీ, ప్రభుత్వ ఉద్యోగి గానీ ఈ క్యూల్లో కనిపించకపోవడం ప్రజల్లో ఆగ్రహాన్ని మరింత పెంచుతోంది. ఆయిల్ కంపెనీలు “ఇంధనం సమృద్ధిగా ఉంది” అని చెబుతున్నా, బంకుల వద్ద కనిపిస్తున్న క్యూలు మాత్రం వాస్తవ పరిస్థితిని బహిర్గతం చేస్తున్నాయి. గ్యాస్ నిల్వలు ఉన్నాయంటున్నా, సగటు కుటుంబం ఇంట్లో పొయ్యి వెలగకపోవడం ప్రజల బాధను మరింత పెంచుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంధనం, గ్యాస్ సరఫరాను సక్రమంగా అందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
“మాకు పెద్ద మాటలు అవసరం లేదు… మా ఇంట్లో పొయ్యి మళ్లీ వెలిగేలా చూడండి” అనే సాధారణ కుటుంబం విజ్ఞప్తి ఇప్పుడు సమాజం మొత్తం వినాల్సిన గళంగా మారింది.