Home Adyatmikam సమ్మక్క-సారలమ్మ జాతరకు మేడారం సిద్ధం

సమ్మక్క-సారలమ్మ జాతరకు మేడారం సిద్ధం

13
0

మేడారం నుంచి మిర్యాలగూడ ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, జనవరి 6:

ప్రసిద్ధ గిరిజన దేవతల జాతర అయిన మేడారం మహా జాతర నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. శాంతిభద్రతలు, జనసౌకర్యాల సమర్థ నిర్వహణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ జాతరను 2026 జనవరి 28 నుంచి 31 వరకు నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
మేడారం జాతర సందర్భంగా పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే వాలంటీర్లను విస్తృతంగా వినియోగించనున్నారు. భక్తుల రాకపోకల నియంత్రణ, మార్గదర్శనం, ప్రాథమిక సమాచారం అందించడం, అవసరమైన చోట సహాయక చర్యలు చేపట్టడం వంటి బాధ్యతలను వాలంటీర్లకు అప్పగించారు. జాతర విధుల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి 23 మంది జిల్లా పంచాయతీ అధికారులు, వీరికి అనుబంధంగా 40 మంది డివిజనల్ అధికారులు, అలాగే సెక్రటేరియట్ అధికారులు ప్రత్యేక డ్యూటీలకు నియమితులయ్యారు.
జాతర జరుగనున్న నాలుగు రోజుల పాటు అధికారులు, సిబ్బంది 24 గంటలపాటు నిరంతర విధుల్లో కొనసాగాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఉన్నతాధికారులు సూచించారు. జాతర అనంతరం పరిస్థితులను సమీక్షించేందుకు అధికారులు ఫిబ్రవరి 2 వరకు విధుల్లో కొనసాగాలని నిర్ణయించినట్లు తెలిపారు.
జాతర కార్యక్రమాలు జనవరి 28న గద్దెకి సారలమ్మ రాకతో ప్రారంభమవుతాయి. అదే రోజు పగిడిద్ద రాజా గోవిందరాజు గద్దెలపైకి రానున్నట్లు అధికారులు తెలిపారు. జనవరి 29న గద్దెకి సమ్మక్క రాక కార్యక్రమం నిర్వహించనున్నారు. జనవరి 30న భక్తులు మొక్కులు చెల్లించుకోగా, జాతర చివరి రోజు జనవరి 31న దేవతల వనప్రవేశాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు.
లక్షలాది భక్తులు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని తాగునీరు, పారిశుధ్యం, రవాణా, వైద్య సేవలు, భద్రత తదితర ఏర్పాట్లను ప్రభుత్వం విస్తృతంగా చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.