Home క్రైమ్ మొలంగూరులో ఎన్నికల అనంతరం ఘర్షణ

మొలంగూరులో ఎన్నికల అనంతరం ఘర్షణ

20
0
  • బాధితుల ఫిర్యాదుపై ఏసీపీ మాధవి విచారణ మానకొండూర్, ఆర్గాన్ న్యూస్, డిసెంబర్ 19:

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని మొలంగూరు గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎనిమిదవ వార్డులో ఓటమి పాలైన వార్డు సభ్యురాలి కుటుంబ సభ్యులు ఓటర్లపై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలపై బాధితులు కేశవపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు మేరకు శుక్రవారం ఏసీపీ మాధవి మొలంగూరు గ్రామంలో విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించిన వివరాలను ఆమె బాధితులైన దాసరి మొగిలి కుటుంబ సభ్యులైన పద్మ, ప్రియాంకల నుంచి సేకరించారు. దాడి ఎలా జరిగింది, ఎవరు పాల్పడ్డారు అనే అంశాలపై సవివరంగా విచారించారు.
విచారణ సమయంలో ఏసీపీ మాధవికి కేశవపట్నం ఎస్ఐ శేఖర్‌తో పాటు పోలీస్ సిబ్బంది తోడుగా ఉన్నారు. ఘటనకు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పవని ఏసీపీ స్పష్టం చేసినట్లు సమాచారం. గ్రామంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలను సహించబోమని హెచ్చరించారు.
ఎన్నికల అనంతరం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నిఘా పెంచినట్లు తెలిపారు. బాధితులకు న్యాయం జరిగేలా పూర్తిస్థాయి విచారణ చేపడతామని పోలీసులు హామీ ఇచ్చారు.