Home agriculture రైతులు పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

రైతులు పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

16
0

మానకొండూర్, ఆర్గాన్ న్యూస్, మార్చి 5:

పాడి రైతులు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఎన్. లింగారెడ్డి సూచించారు. గురువారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ మండలంలోని మహాత్మా నగర్, పొలంపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన ఉచిత పశువైద్య శిబిరాలను స్థానిక సర్పంచ్ పొన్నాల సంపత్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా నియమితులైన యువ పశువైద్య అధికారులకు కరీంనగర్ ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణ కేంద్రంలో 45 రోజుల ప్రత్యేక శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణలో భాగంగా గ్రామాల్లో తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ మరియు పశువైద్య, పశుసంవర్ధక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పాడి పశువుల గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ లింగారెడ్డి మాట్లాడుతూ పాడి రైతుల లాభనష్టాలను ప్రభావితం చేసే అంశాల్లో పాడి పశువుల పునరుత్పత్తి సమస్యలు అత్యంత కీలకమని అన్నారు. పశువుల గర్భధారణలో ఆలస్యం, గర్భస్రావాలు, ఇతర పునరుత్పత్తి సంబంధిత వ్యాధులు రైతులకు ఆర్థికంగా నష్టాలను కలిగిస్తాయని తెలిపారు. ఈ సమస్యల పరిష్కారానికి పశువైద్యాధికారులకు సాంకేతిక నైపుణ్యం అవసరమని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో పునరుత్పత్తి సమస్యలపై అనుభవం కలిగిన సీనియర్ అధికారులను శిక్షణకు అధ్యాపకులుగా నియమించినట్లు చెప్పారు. 45 రోజుల శిక్షణలో 42 రోజులు తరగతి గదిలో సిద్దాంతపరమైన అవగాహన కల్పించగా, రెండు రోజులు క్షేత్రస్థాయిలో పాడి పశువులు అధికంగా ఉన్న గ్రామాల్లో ఉచిత గర్భకోశ నివారణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. దీని ద్వారా పశువైద్యుల నైపుణ్యం పెంపొందడంతో పాటు గ్రామీణ రైతులకు ప్రత్యక్ష లాభం చేకూరుతుందని తెలిపారు.
ఈ శిబిరాల్లో పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. మండలంలోని పొలంపల్లి, మహాత్మా నగర్ గ్రామాల్లో నిర్వహించిన శిబిరాల ద్వారా మొత్తం 81 పాడి పశువులకు పరీక్షలు చేసి మందులు అందజేసినట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ముఖ్య అధికారి డాక్టర్ శ్రీదేవి, తిమ్మాపూర్ మండల పశువైద్యాధికారులు డాక్టర్ సురేందర్ రెడ్డి, డాక్టర్ భారతి, డాక్టర్ మౌనిక, సహాయ సిబ్బంది ఆకుల శ్రీధర్, పొలంపల్లి సర్పంచ్ గుంటి లావణ్య, నిపుణులు డాక్టర్ రాజిరెడ్డి, డాక్టర్ అంబి రాజేష్, డాక్టర్ హన్నన్, శిక్షణ కేంద్రం అధ్యాపకులు డాక్టర్ సాయి చైతన్య, డాక్టర్ దివ్య, గోపాలమిత్రులు తదితరులు పాల్గొన్నారు.