- వామపక్షాల ఐక్యతే కాలానికి అవసరం
- కార్పొరేట్ –
మతతత్వ శక్తులపై ఐక్య పోరాటాలే పరిష్కారం - వర్గపోరాటాల ద్వారానే సమసమాజ నిర్మాణం
- లెఫ్ట్ సెమినార్ లో కమ్యూనిస్టులకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నిర్దేశం
ఖమ్మం ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, జనవరి 20 :
సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఖమ్మంలో మంగళవారం ఎస్.ఆర్. గార్డెన్‌లో నిర్వహించిన “భారతదేశ రాజకీయాలు – వామపక్షాల ముందున్న సవాళ్లు” అనే జాతీయ స్థాయి సెమినార్‌లో రాష్ట్ర డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ అగ్రనేత మల్లు భట్టి విక్రమార్క పాల్గొని కమ్యూనిస్టులకు స్పష్టమైన రాజకీయ దిశానిర్దేశం చేశారు.
కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలను ప్రస్తావిస్తూ, వర్గపోరాటాల ద్వారానే సమసమాజం సాధ్యమవుతుందని, మారిన దేశ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వామపక్షాలు ఐక్యంగా కదలాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
కార్పొరేట్ సవాళ్లు
దేశంలో ప్రజాస్వామ్యానికి కార్పొరేట్ శక్తులు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల చేతిలో బంధీగా మారిందని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. మతాన్ని అడ్డుపెట్టుకుని లబ్ధి పొందేందుకు కార్పొరేట్–ఫాసిస్టు శక్తులు ప్రజలను విభజించే ప్రయత్నం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
పార్లమెంటు ప్రజాస్వామ్యాన్ని బీజేపీ నేతృత్వంలోని మతతత్వ శక్తులు నిర్వీర్యం చేస్తున్నాయని, ఆర్థిక–సామాజిక సమస్యలను పక్కదారి పట్టిస్తున్నాయని విమర్శించారు. లౌకిక ప్రజాతంత్ర శక్తుల ఐక్యతతోనే మతతత్వ శక్తులను అడ్డుకోగలమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
కమ్యూనిస్టుల త్యాగాలు చరిత్ర మరువదు
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం దేశ రాజకీయాలకు సరికొత్త సందేశాన్ని ఇచ్చిందని గుర్తు చేసిన ఆయన, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు చేసిన త్యాగాలు ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, పేదల విముక్తి కోసం కమ్యూనిస్టులు చేసిన పోరాటాలు తెలంగాణ నేల గౌరవాన్ని పెంచాయని తెలిపారు.
ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో ప్రతి ఇంటి తలుపు తట్టినా ఒక పోరాట గాథ వినిపిస్తుందన్నారు. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే కౌలుదారి చట్టం, భూ సంస్కరణలు, 20 సూత్రాల పథకం, బ్యాంకుల జాతీయీకరణ, అలాగే ఇటీవల కాలంలో సమాచార హక్కు చట్టం, జాతీయ ఉపాధి హామీ పథకం వంటి ప్రజా అనుకూల విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందని గుర్తు చేశారు.
ప్రస్తుతం వ్యవస్తే ప్రశ్నర్ధకంగా ఉంది
ప్రస్తుతం దేశంలో పార్లమెంటు వ్యవస్థే ప్రశ్నార్థకంగా మారిందని, ఒకవైపు ఫాసిస్టు శక్తులు, మరోవైపు కార్పొరేట్ శక్తులు దేశాన్ని చిన్నాభిన్నం చేయాలని చూస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి సమయంలో వామపక్షాలు బలపడటం దేశానికి అత్యంత అవసరమని అన్నారు.
రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య రక్షణ వామపక్షాలు–కాంగ్రెస్‌తో పాటు ఇతర లౌకిక శక్తుల సమిష్టి బాధ్యత అని స్పష్టం చేసిన భట్టి విక్రమార్క, ఓటు హక్కు సైతం ప్రమాదంలో పడుతున్న ఈ కాలంలో ఐక్య పోరాటాలు తప్పనిసరిగా అవసరమని అన్నారు.
ఖమ్మం జిల్లా అనేక భావజాలాలకు నిలయమని, అతిథ్య సంస్కృతిలో ముందుండే జిల్లాగా గుర్తింపు ఉందని పేర్కొంటూ, వామపక్షాలకు బలమైన కేంద్రంగా ఉన్న ఖమ్మంలో జాతీయ స్థాయి సెమినార్ నిర్వహించడంపై ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వందేళ్ల సిపిఐ చరిత్రను ప్రతిబింబించే సీడీని మల్లు భట్టి విక్రమార్క ఆవిష్కరించారు.


