- జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
- జిల్లాలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ
- గ్రానైట్ రంగం నిలబడితే వేల కుటుంబాలకు జీవనోపాధి
- గ్రానైట్ పరిశ్రమల యాజమాన్యం వాతావరణం కాలుష్యం నివారణ జాగ్రతలు చేపట్టాలి
- ఖమ్మం ఇండస్ట్రియల్ కాలనీలోని గ్రానైట్ యూనిట్లను సందర్శించి సమస్యలు పరిశీలించి, అవసరాలు తెలుసుకున్న జిల్లా కలెక్టర్
ఖమ్మం,ఆర్గాన్ న్యూస్, డిసెంబర్ 8:
గ్రానైట్ రంగం నిలబడితే వేల కుటుంబాలకు జీవనోపాధి లభిస్తుందని, త్వరలోనే పరిశ్రమ ప్రతినిధులతో విస్తృత సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.
సోమవారం స్థానిక ఖానాపురం లోని ఇండస్ట్రియల్ కాలనీ గ్రానైట్ పారిశ్రామిక ప్రాంతాన్ని కలెక్టర్ సందర్శించి పరిశ్రమల స్థితిగతులను, పరిస్థితులను క్షేత్రస్థాయిలో తిరుగుతూ పరిశీలించారు. పలు గ్రానైట్ యూనిట్లలో జరుగుతున్న ఉత్పత్తి, ప్రాసెసింగ్ పనులపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. యూనిట్ నిర్వాహకులు, పారిశ్రామిక వేత్తలు, కార్మికులతో కలెక్టర్ సంభాషిస్తూ పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను ఆరా తీశారు. విద్యుత్ ఛార్జీలు, ఎగుమతి సమస్యలు, మార్కెట్ డిమాండ్ తగ్గుదల, ముడి సామగ్రి రవాణా వ్యయాల పెరుగుదల వంటి పలు అంశాలపై కలెక్టర్ వివరాలు సేకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ…
జిల్లాలో ప్రస్తుతం ఉన్న గ్రానైట్ పరిశ్రమకు పునరుద్ధరణ మార్గాలు చూపించే దిశగా ప్రభుత్వం తరుపున అభివృద్దికి ముందడుగు వేస్తున్నామన్నారు. పరిశ్రమల విస్తరింపు, కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ, మౌళక సదుపాయాలు, భద్రతా చర్యలను అవసరమైన సహకారం అందించడానికి జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు.
పరిశ్రమల్లో నైపుణ్య అభివృద్ధి, ఉత్పత్తి ప్రమాణాల మెరుగుదల, మార్కెటింగ్ అవకాశాల విస్తరణ వంటి అంశాలపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రానైట్ పరిశ్రమ జిల్లాలో వేలాది మంది కుటుంబాల జీవన ఆధారమని, పరిశ్రమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత వరకు పరిష్కారం అందించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. పరిశ్రమ బలోపేతం ద్వారా జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరిగి స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని అన్నారు.
ఖమ్మం అభివృద్ధి కోసం గ్రానైట్ పరిశ్రమల పురోగతి అత్యవసరమని, ఈ ప్రాంత యువతకు పారిశ్రామిక అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగాన్ని మరింత విస్తరించడానికి ప్రతిష్టాత్మకంగా ప్రణాళికను రూపొందిస్తుందని తెలిపారు. చిన్న స్థాయి పారిశ్రామిక సంస్థలు తమ వ్యాపారాలను ప్రారంభించి, నడిపించేందుకు అవసరమైన మౌళిక సదుపాయాలను కల్పిస్తూ అనుకూలమైన పారిశ్రామిక వాతావరణాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు.
పరిశ్రమలు ఆర్థిక వ్యవస్థను బలంగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయని, గ్రానైట్ యాజమాన్యం వాతావరణం కాలుష్య నివారణకు ఆదేశాలను పాటిస్తూ, ప్రజలకు ఇబ్బందులు లేకుండా జాగ్రతలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమలు శాఖ జనరల్ మేనేజర్ సీతారాం నాయక్, ఖమ్మం ఆర్డీవో నరసింహారావు, టిజి ఐఐసి డిఈ స్మరత్ చంద్ర, జెఈ శివకుమార్, ఖమ్మం అర్బన్ మండల తహసీల్దారు సైదులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.








