Home ఖమ్మం పేదల గుడిసెలు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా ?

పేదల గుడిసెలు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా ?

27
0

ఖమ్మం,ఆర్గాన్ న్యూస్ :

నగర శివారులోని భూదాన్ భూముల్లో పదేళ్లుగా నివాసం ఉంటున్న పేదల గుడిసెలను కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా కూల్చి వేయడాన్ని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు.
అక్కడ నివాసముంటున్న సుమారు 600 పేద కుటుంబాల పై వందలాది మంది పోలీసులు, పదుల సంఖ్యలో జేసీబీలు, ట్రాక్టర్లతో తెల్లవారు జామునే దాడి చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పదే పదే ఇందిరమ్మ రాజ్యం అని ప్రగల్బాలు పలికే కాంగ్రెస్ నేతలు.. పేదల ఇల్లు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా.. సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. పేదల గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటూ, న్యాయపరంగా పోరాడుతున్న పేదల పై ప్రభుత్వం దుర్మార్గంగా విరుచుకుపడటం ద్వారా కాంగ్రెస్ అసలు స్వరూపాన్ని బయటపెట్టిందని మండిపడ్డారు. గుడిసెల తొలగింపును బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, బాధితులకు అండగా ఉంటామని ఎంపీ రవిచంద్ర హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదప్రజల పై నిజంగా సానుభూతి ఉంటే తక్షణమే అక్కడ అర్హులైన పేద కుటుంబాలకు పట్టాలు మంజూరు చేయాలని వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు.