Home POLITICS మానకొండూరులో హరీష్ రావు ధ్వజం..

మానకొండూరులో హరీష్ రావు ధ్వజం..

3
0
  • కాంగ్రెస్ పాలనలో స్కీములు కాదు, స్కాములేనని విమర్శ మానకొండూర్, ఆర్గాన్ న్యూస్, జూన్ 16:

కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని అల్గనూర్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమంలో మానకొండూరు కార్యకర్తలు పోషించిన పాత్రను గుర్తు చేసిన ఆయన, 2001లో పార్టీ ఆవిర్భావం నుంచే బీఆర్ఎస్‌కు ఈ నియోజకవర్గం బలమైన కోటగా నిలిచిందన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా కార్యకర్తల బలం ఉన్న పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తలపై ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించిన హరీష్ రావు, ఓటమి భయంతో, రాజకీయ నిరాశతో ఉన్నవారే ఇలాంటి చర్యలకు పాల్పడతారని అన్నారు. తమపై ఎన్ని కేసులు పెడితే ప్రజల్లో బీఆర్ఎస్‌కు అంత ఆదరణ పెరుగుతుందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్‌ను అడ్డుకుంటానని చెబుతున్నప్పటికీ ప్రజల్లో పార్టీ బలం మరింత పెరుగుతోందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాల కంటే స్కాములే ఎక్కువగా కనిపిస్తున్నాయని హరీష్ రావు విమర్శించారు. సివిల్ సప్లైస్, సింగరేణి, విద్యుత్, భూములు, గురుకులాల సరఫరా టెండర్ల వరకు అవినీతి విస్తరించిందని ఆరోపించారు. గురుకులాల్లో దుస్తులు, బూట్లు, ఆహార సరఫరాలకు సంబంధించిన టెండర్లలో భారీ అవకతవకలు జరిగాయని పేర్కొన్నారు. తాను ఈ విషయాలను ప్రస్తావిస్తే సంబంధిత మంత్రులు సవాళ్లు విసురుతున్నారని, కానీ టెండర్ల వివరాలే వారికి తెలియడం లేదని ఎద్దేవా చేశారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రైతు బంధు, రైతు బీమా, కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రుణమాఫీ, రైతు భరోసా, మహాలక్ష్మి, పెన్షన్ పెంపు వంటి హామీలు అమలు కాలేదని విమర్శించారు.
రైతు బంధు బకాయిల పేరుతో ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు రైతులకు చెల్లించాల్సి ఉందని హరీష్ రావు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం, తరుగుల పేరుతో కోతలు, కొనుగోలు కేంద్రాల్లో అవ్యవస్థల వల్ల రైతులు నష్టపోతున్నారని ఆరోపించారు. రైతు బీమాకు ప్రీమియం చెల్లించకపోవడంతో పథకం నిలిచిపోయిందని, పంట బోనస్ విషయంలో కూడా ప్రభుత్వం తరచూ నిబంధనలు మార్చి రైతులను అయోమయానికి గురి చేస్తోందన్నారు.
పంట బోనస్‌ను అన్ని రకాల ధాన్యాలకు ఇస్తామని చెప్పి తర్వాత కొన్ని రకాలకే పరిమితం చేయడం రైతులను మోసం చేయడమేనని హరీష్ రావు విమర్శించారు. రైతులు ఏ పంట వేయాలో కూడా ప్రభుత్వం నిర్ణయించే పరిస్థితి తీసుకురావడం వ్యవసాయ రంగానికి ప్రమాదకరమని అన్నారు. పంటల మార్పిడి పేరుతో గతంలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసిన రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారని, ఇప్పుడు వారికి ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇవ్వడం లేదన్నారు.
24 గంటల ఉచిత విద్యుత్‌ను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, రైతు డిస్కమ్ పేరుతో కొత్త విధానాలు తీసుకురావాలని చూస్తోందని ఆరోపించారు. ఇది అమల్లోకి వస్తే రైతులకు పరిమిత గంటల విద్యుత్ మాత్రమే అందే ప్రమాదం ఉందన్నారు. ఉచిత విద్యుత్‌పై కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలు రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీష్ రావు విమర్శించారు. పోలీసు శాఖలో వేలాది ఖాళీలు ఉన్నప్పటికీ పరిమిత ఉద్యోగాలకే నోటిఫికేషన్లు ఇస్తున్నారని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కారణంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, చదువులు పూర్తయినా సర్టిఫికెట్లు పొందలేని పరిస్థితి నెలకొందని చెప్పారు.
ఖజానా ఖాళీగా ఉందని చెప్పే ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ, మూసీ సుందరీకరణ, క్యాంపు కార్యాలయాల నిర్మాణం, ప్రచార కార్యక్రమాల కోసం మాత్రం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని హరీష్ రావు ఆరోపించారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు.
రైతు భరోసా, పంట బోనస్, రైతు బీమా, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేసిన హరీష్ రావు, ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ మరింత బలంగా ప్రజల్లోకి వెళ్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.