Home ఖమ్మం నాలుగు కొత్త కార్మిక కోడ్ లు అమలు

నాలుగు కొత్త కార్మిక కోడ్ లు అమలు

27
0
  • ప్రాంతీయ పీఎఫ్ కమీషనర్ శ్రీనివాస్

ఖమ్మం వన్ టౌన్, ఆర్గాన్ న్యూస్, ఫిబ్రవరి 5:

2025 నవంబర్ 21 నుంచి నాలుగు కొత్త కార్మిక కోడ్ లు అమలు లోకి వచ్చాయని ప్రాంతీయ పీఎఫ్ కమీషనర్ వై.డి. శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
భారత ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను ఏకీకృతం చేసి, నాలుగు సమగ్ర కార్మిక కోడ్ లను అమలులోకి తీసుకువచ్చిందని అన్నారు.
వేతనాల కోడ్ 2019, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, సామాజిక భద్రత కోడ్ 2020, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని ప్రదేశ పరిస్థితుల కోడ్ 2020 లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లేబర్ కోడ్స్ ప్రకారం ఈపిఎఫ్ వేతనాల నిర్వచనం ఏకరీతిగా అమలులోకి వచ్చిందని అన్నారు. వేతనాలు అంటే బేసిక్ పే, డియర్నెస్ అలవెన్స్ (DA), రిటైనింగ్ అలవెన్స్ కలిపి తీసుకోవాలనీ, హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), బోనస్, ఓవరైమ్ అలవెన్స్, కన్వేయెన్స్ అలవెన్స్, కమీషన్, ఇతర సౌకర్యాల విలువలను వేతనాల నుండి మినహాయించాలని తెలిపారు. అయితే ఈ మినహాయింపులు మొత్తం వేతనంలో 50 శాతం కంటే ఎక్కువైతే, అదనపు భాగాన్ని తిరిగి వేతనాల నిర్వచనంలో కలపాలని అన్నారు.
నూతన విధానాల వల్ల ఈపిఎఫ్ కాంట్రిబ్యూషన్ బేస్ పెరుగుతుందని, ఉద్యోగులకు పిఎఫ్ డిడక్షన్ ఎక్కువైనా, రిటైర్మెంట్ సేవింగ్స్ పెరుగుతాయని , యజమానులకు కాంప్లయెన్స్ స్పష్టత వస్తుందని, వేతనాలను కృత్రిమంగా తగ్గించడం కష్టమవుతుందని, ఈ మార్పులు ఉద్యోగుల భవిష్యత్ భద్రతను బలోపేతం చేస్తాయని అన్నారు.
ఈ కార్మిక కోడ్ లు ఆత్మనిర్బర్ భారత్ లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషిస్తాయని, కార్మికుల సంక్షేమం, వ్యాపార సౌలభ్యం మధ్య సమతుల్యతను కాపాడుతూ దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయని, ఈ కోడ్ ల క్రింద లభించే ప్రయోజనాలను వినియోగించుకోవాలని యజమానులకు, ఉద్యోగులకు వై.డి. శ్రీనివాస్ ఆ ప్రకటనలో సూచించారు.