Home క్రైమ్ గర్భమే సమాధి..!

గర్భమే సమాధి..!

18
0
  • మిర్యాలగూడలో ఆడ శిశువుల ఊచకోత
  • పాలకుల మౌనం పాపమా ?
  • నిశ్శబ్దంగా చూస్తున్న వ్యవస్థ…
  • మౌనంగా చంపుతున్న సమాజం !

మిర్యాలగూడ ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, డిసెంబర్ 31:
మిర్యాలగూడ పట్టణం మానవత్వాన్ని కోల్పోతున్నదా?
తల్లి గర్భమే సురక్షితంగా లేకుండా మారిన భయానక పరిస్థితులు వరుసగా వెలుగుచూస్తూ సమాజాన్ని గగుర్పాటుకు గురిచేస్తున్నాయి. బుధవారం ఉదయం మిర్యాలగూడ పట్టణం షాబునగర్ ప్రాంతంలోని మురికికాలువ పక్కన ఆరు నెలల గర్భస్థ ఆడ శిశువు మృతదేహం లభించడం తీవ్ర కలకలం రేపింది. ఈ హృదయవిదారక దృశ్యాన్ని చూసిన పారిశుధ్య కార్మికులు సైతం స్థంభించిపోయారు.
ఇది ఒక్క ఘటన కాదు…
రెండు నెలల క్రితం విద్యానగర్ సబ్‌జైల్ రోడ్డులో కుక్క నోట్లో ఆడ శిశువు మృతదేహం లభించడం అప్పట్లోనే నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అయినా పాలక వ్యవస్థ స్పందించలేదు… అధికారులు నోరు మెదపలేదు…
ఫలితంగా అదే నరక దృశ్యం మళ్లీ మళ్లీ పునరావృతమవుతోంది.
తల్లి గర్భంలోనే ఆడ శిశువులను అంతమొందిస్తున్న ఈ అమానుషత్వం నాగరిక సమాజానికి చెంపపెట్టు వంటిదని స్థానికులు మండిపడుతున్నారు. అక్రమ గర్భస్రావాలకు పాల్పడుతున్న వారిని, వారికి అండగా నిలుస్తున్న వైద్యులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికైనా పాలకులు మేల్కొకపోతే…
రేపు ఇంకెన్ని నిరపరాధ ఆడ శిశువులు మౌనంగా బలైపోతాయో చెప్పలేని పరిస్థితి నెలకొన్నదని మిర్యాలగూడ అంతటా ఆవేదన వ్యక్తమవుతోంది.