రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్ | ఫిబ్రవరి 4:
కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయానికి చెందిన భూముల్లో అక్రమంగా నిర్మించిన 11 ఇండ్లను దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కోర్టు ఆదేశాల మేరకు పోలీసు బందోబస్తుతో ఖాళీ చేయించి స్వాధీనం చేసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ చర్యతో ఆలయ పరిసర ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
దేవాదాయ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సైదాబాద్ గ్రామ సర్వే నెంబరు 110లోని 2.11 ఎకరాల భూమి కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయానికి అనుబంధంగా ఉన్న బన్సరి వారి కృష్ణ మందిరానికి చెందినదని తెలిపారు. ఈ భూమిలో మొత్తం 21 ఇండ్లు ఉండగా, అందులో 10 ఇండ్లకు అద్దె చెల్లింపులు జరుగుతున్నాయని, మిగిలిన 11 ఇండ్లపై దేవాదాయ ట్రిబ్యునల్ కోర్టు ఉత్తర్వుల మేరకు స్వాధీనం చేపట్టామని అన్నారు.
ఇళ్లను ఖాళీ చేయడంపై నివాసితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, తాము 35 సంవత్సరాలుగా అక్కడ నివసిస్తున్నామని, అప్పీల్ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. పరిస్థితిని తెలుసుకున్న మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. కోర్టు ఆదేశాల పేరుతో పేదలను రోడ్లపైకి నెట్టవద్దని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
అయితే, దేవాదాయ శాఖ ఈవో లావణ్య స్పందిస్తూ, మూడు నెలల క్రితమే నోటీసులు జారీ చేసి, చట్టపరమైన ప్రక్రియలన్నీ పూర్తి చేసిన తరువాతే స్వాధీనం చేపట్టామని స్పష్టం చేశారు.


