Home తెలంగాణ కరీంనగర్ జిల్లాలో గాలికుంటు టీకా కార్యక్రమం వేగవంతం

కరీంనగర్ జిల్లాలో గాలికుంటు టీకా కార్యక్రమం వేగవంతం

32
0

కరీంనగర్, ఆర్గాన్ న్యూస్, మార్చి 17:

కరీంనగర్ జిల్లాలో చేపట్టిన గాలికుంటు వ్యాధి నియంత్రణ టీకా కార్యక్రమం కొనసాగుతోంది. జిల్లాలో మొత్తం 92,500 పశువులకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 14,468 పశువులకు టీకాలు పూర్తి చేసినట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి లింగారెడ్డి తెలిపారు.
మంగళవారం చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో నిర్వహించిన టీకా శిబిరాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఏప్రిల్ 9లోపు లక్ష్యాన్ని పూర్తిచేస్తామని చెప్పారు.
గాలికుంటు వ్యాధి సోకిన పశువుల్లో నోరు, చిగుళ్లు, కాళ్ల గోళ్ల మధ్య పొక్కులు ఏర్పడి తీవ్ర జ్వరంతో బాధపడతాయని తెలిపారు. అలాగే సొంగ కార్చడం, మేత మేయకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా సంకరజాతి పశువుల్లో ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు.
ఈ వ్యాధి గాలి, నీరు, మేత, అలాగే దూడలకు పాలు ద్వారా వేగంగా వ్యాప్తి చెందుతుందని ఆయన వివరించారు. మూడు నెలలు దాటిన దూడలు సహా గేదెలు, ఆవులు, ఎద్దులకు ఉచితంగా టీకాలు వేస్తున్నామని తెలిపారు.
జిల్లాలోని అన్ని గ్రామాల్లో వైద్య సిబ్బంది టీకా కార్యక్రమం కొనసాగిస్తున్నారని, ప్రతి రైతు తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని సూచించారు.
ఈ శిబిరంలో చిగురుమామిడి పశువైద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది శ్రీనివాస్, సత్యం, కుమార్, వెంకటయ్య పాల్గొన్నారు. అలాగే ఓగులాపూర్ గ్రామంలో ఇందుర్తి పశువైద్యాధికారి సాంబారావు సిబ్బందితో కలిసి టీకాలు వేశారు.