Home Uncategorized ఏప్రిల్ నెలంతా ఎస్సారెస్పీ నీరు విడుదల చేయాలి

ఏప్రిల్ నెలంతా ఎస్సారెస్పీ నీరు విడుదల చేయాలి

19
0
  • గ్రామీణ పేదల సంఘం డిమాండ్

సూర్యాపేట, ఆర్గాన్ న్యూస్ , మార్చి 30:

ఏప్రిల్ నెల మొత్తం ఎస్సారెస్పీ నీటిని నిరంతరాయంగా పూర్తిస్థాయిలో విడుదల చేయాలని గ్రామీణ పేదల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నీటిపారుదల శాఖ ఈఈ యాదగిరికి సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి కోనకంచి వీరభద్రయ్య మాట్లాడుతూ, వారబంది విధానంలో నీరు సరఫరా చేయడం వల్ల ఇప్పటికే 50 శాతం పైగా వరి పొలాలు నాటిన రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. మిగిలిన రైతులకు కనీసం ఏప్రిల్ నెలంతా నిరంతరాయంగా నీరు అందిస్తే, కనీసం 50 శాతం మంది రైతులు తమ పంటను కోయగల పరిస్థితి ఉంటుందని అన్నారు.
అయితే అధికారులు, ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. చివరి అంచు భూముల వరకు నీటిని అందించకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ జిల్లా కార్యదర్శి భాషిపంగు సునీల్, అనంతుల యల్లయ్య, నారాయణరెడ్డి, కళావతి, భూక్య వెంకన్న తదితరులు పాల్గొన్నారు.