- మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్నలు కొనుగోలు చేయాలి
- రుణమాఫీ విషయంలో మాట తప్పిన సర్కార్
- ధరణికి నకలుగా మారిన భూ భారతి
- రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాగం హేమంతరావు
- కలెక్టరేట్ వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన
ఖమ్మం టూ టౌన్, ఆర్గాన్ న్యూస్, మార్చి 18:
రైతాంగ సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట అధ్యక్షులు బాగం హేమంతరావు ఆరోపించారు. రైతులకు ఇచ్చిన ఏ హామీని ఈ ప్రభుత్వం అమలు చేయలేదని ఆయన తెలిపారు. ప్రభుత్వ ధోరణి మారకపోతే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు. రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ బుధవారం తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. కలెక్టరేట్లోకి వాహనాలు పోకుండా అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున రైతులు నినాదాలు చేశారు. ఆందోళనను ఉద్దేశించి బాగం హేమంతరావు మాట్లాడుతూ కేసిఆర్ బాటలోనే తెలంగాణ ప్రభుత్వం రైతాంగ విషయంలో పయనిస్తుందన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ లో పత్తి పంట దెబ్బతిన్న తర్వాత రైతులు రెండవ పంటగా మొక్కజొన్నను సాగు చేశారని రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 12 లక్షల ఎకరాల్లో మొక్కజొన్నను సాగు చేశారని ఆయన తెలిపారు. ప్రభుత్వ వైఖరి కారణంగా మొక్కజొన్నపై రైతుల ఆశలు ఆడి ఆశలయ్యాయని మొక్కజొన్నకు మద్దతు ధర రూ. 2,400 ఉండగా ఎగుమతులు నిలిచిపోవడం, మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేయకపోవడంతో క్వింటాకు రూ.1,200 నుంచి రూ.1,300లకు మాత్రమే ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం మార్క్ఫెడ్ను రంగంలోకి దించి రూ.2,400 చొప్పున కొనుగోలు చేయాలన్నారు. రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ సర్కార్ మాట తప్పిందని ఇప్పటికే రైతు భరోసాకు సంబంధించి ఒక సీజన్ తప్పించిందని ఇప్పుడు మార్చి వచ్చిన రైతు భరోసా డబ్బులు వేయలేదని 22 నుంచి వేస్తామని చెబుతున్నా దశల వారీ అంటున్నారని అంతిమంగా ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పడం లేదని హేమంతరావు తెలిపారు. పెట్టబడికి అందించాల్సిన సాయం వ్యవసాయం ముగిసిన తర్వాత అందిస్తారా.. ? అని ప్రశ్నించారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ప్రభుత్వం కాకి లెక్కలు చెబుతూ రుణమాఫీ పూర్తయిందని ప్రకటించడం దివాళాకోరుతనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. రెండు లక్షలు పైబడిన సొమ్మును రైతులు చెల్లిస్తే రెండు లక్షల రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తుందని మంత్రులు ప్రకటించారని కానీ ఇంత వరకు ఆ పని చేయకుండానే రుణమాఫీ పూర్తయిందని ఎలా ప్రకటిస్తారని ..? హేమంతరావు ప్రశ్నించారు. పంటల బీమాను అమలు చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఐదు సీజన్లు గడిచినా పంటల బీమాను అమలు చేయలేదని ఆయన విమర్శించారు.ఈ ఏడాది ఖరీఫ్ నుంచైనా పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భూ భారతి ధరణికి నకలుగా మారిందని 9.25 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయని రైతులు పట్టాదారు పాసుపుస్తకాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. సిసిఎల్ఎ నిబంధనలు సాదా బైనామా అంటూ కాలయాపన చేయడం తగదన్నారు. రైతాంగ 1/2
సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని లేకపోతే ఆగ్రహానికి గురికాక తప్పదని హేమంతరావు హెచ్చరించారు.ఈ ఆందోళన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, సహయ కార్యదర్శి జమ్ముల జితేందర్రెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దొండపాటి రమేష్, కొండపర్తి గోవిందరావు, రైతు సంఘం నాయకులు మిడికంటి వెంకటరెడ్డి, కూచిపూడి రవి, పావులూరి మల్లికార్జున్, సీతారాములు, బానోత్ రాంకోటి, తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, పి. వెంకట నర్సయ్య, పగిళ్ల వీరభద్రం, పుచ్చకాయల సుధాకర్, దొబ్బల వెంగళరావు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.








