Home వైరల్ ఖమ్మం అక్రిడిటేషన్లలో అక్రమాల ఆరోపణలు

ఖమ్మం అక్రిడిటేషన్లలో అక్రమాల ఆరోపణలు

9
0
  • సమగ్ర విచారణ కోరిన జర్నలిస్టులు
  • కమిటీ నియామకం, దరఖాస్తుల పరిశీలనలో పారదర్శకత లోపం.. ఆరోపణలు
  • అనర్హులకు కార్డులు, అర్హులకు అన్యాయం జరుగుతోందని ఆందోళన

ఆర్గాన్ న్యూస్,
ఖమ్మం, మే 4:

ఖమ్మం జిల్లాలో 2026–28 కాలానికి జర్నలిస్టుల మీడియా అక్రిడిటేషన్ ప్రక్రియపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, సమగ్ర విచారణ చేపట్టాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్‌ను కోరింది. జిల్లా అధ్యక్షుడు నానబాల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి అర్వపల్లి నగేష్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది.
ఫెడరేషన్ ప్రతినిధులు పేర్కొన్న ప్రకారం, అక్రిడిటేషన్ కమిటీ సభ్యుల నియామకంలో పారదర్శకత పాటించలేదని, అన్ని జర్నలిస్టు సంఘాలకు సముచిత ప్రాతినిధ్యం ఇవ్వకుండా ఒకే యూనియన్‌కు ప్రాధాన్యత కల్పించినట్లు ఆరోపించారు. కమిటీ నియామకం గోప్యంగా నిర్వహించబడిందని, ముందస్తు సమాచారం లేకుండా తీసుకున్న నిర్ణయాలు జర్నలిస్టు వర్గాల్లో అనుమానాలకు తావిస్తున్నాయని తెలిపారు.
అలాగే, అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియలోనూ తీవ్ర అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ఆన్లైన్‌లో వచ్చిన దరఖాస్తుల పరిశీలనలో ప్రభుత్వ జీవో నెం.252లో పేర్కొన్న ప్రమాణాలు పాటించకుండా, సర్క్యులేషన్, నియామక పత్రాలు, అనుభవ ధృవీకరణ వంటి కీలక పత్రాలను సమగ్రంగా పరిశీలించలేదని పేర్కొన్నారు. ఫీల్డ్ అనుభవం లేని వారికీ కార్డులు మంజూరు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయని, దీనివల్ల నిజంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో అక్రమంగా మంజూరైన దరఖాస్తులను పునఃపరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా అర్హులైన వారికి మాత్రమే అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని, భవిష్యత్తులో కమిటీ నియామకాల్లో అన్ని సంఘాలకు సమాన అవకాశాలు కల్పించాలని ఫెడరేషన్ డిమాండ్ చేసింది. మీడియా అక్రిడిటేషన్ ప్రక్రియలో పారదర్శకత, నిష్పక్షపాతత్వం పాటించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరింది.