- ప్రజలతో మమేకమై ప్రజా దర్బార్ కార్యక్రమం
- గ్రామ సమస్యలను గ్రామంలోనే సత్వరమే పరిష్కరించే విధంగా ఆదేశాలు
- రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి దనసరి అనసూయ సీతక్క ములుగు జిల్లా, ఆర్గాన్ న్యూస్, ఏప్రిల్ 18:
ప్రజల సమస్యలను గ్రామాలలోనే క్షేత్రస్థాయిలో పరిష్కరించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని నేరుగా ప్రజలతో మమేకమై సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారానికి సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలిస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. శనివారం ములుగు మండలం రాయినిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో రాయినిగూడెం కొత్తూరు పంచోత్తుల పల్లె గ్రామాలకు సంబంధించి అనంతరం సర్వాపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలో పెగడపల్లి సర్వాపురం అంకన్నగూడెం గ్రామాల ప్రజల సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమాల్లో మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తో కలిసి ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుంటూ అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ గ్రామాలలోని సమస్యలను నేరుగా పరిష్కరించడానికి గ్రామాలలో ప్రజా దర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాలలో ఉండే గ్రామస్తులు కార్యాలయాలకు రాలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని దృష్టిలో ఉంచుకొని స్వయంగా ఆ గ్రామాలలోనే ప్రజా దర్బార్ నిర్వహించి సమస్యలపై గ్రామ అభివృద్ధిపై కూలంకషంగా చర్చించుకోవడానికి అణువుగా ఉండటానికి ఇలాంటి కార్యక్రమాలను ప్రజలతో మమేకమై ఏర్పాటు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా స్థానిక సమస్యలు వెంటనే పరిష్కరించడం వలన ప్రజలు సమస్యల నుంచి ఉపశమనం కలగడమే కాక అనేక ప్రయోజనాలు చేకూరుతూ మెరుగైన అభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడానికి అహర్నిశలు జిల్లా అభివృద్ధికి పాటుపడుతున్న జిల్లా కలెక్టర్ ను ప్రత్యేకంగా అభినందించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని గ్రామాలలోనే ప్రజాదర్బార్ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా స్థానిక సమస్యలు స్థానికంగానే పరిష్కరించడానికి వీలవుతుందని మారుమూల ప్రాంతాలలో ఉండే ప్రజలు సమస్యల విన్నపానికై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదని గ్రామాలకే ప్రభుత్వ యంత్రాంగం అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ అదనపు కలెక్టర్లు సిహెచ్ మహేందర్ జి సంపత్ రావు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కళ్యాణి ఆర్డిఓ వెంకటేష్ రాష్ట్ర పంచాయతీ రాజ్ డైరెక్టర్ భగవాన్ రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులు అన్ని శాఖల అధికారులు అన్ని గ్రామాల ప్రజలు అర్జిదారులు తదితరులు పాల్గొన్నారు.


