Home POLITICS గ్రీన్ హైడ్రోజన్ ప్రణాళికలపై కేంద్రాన్ని ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ

గ్రీన్ హైడ్రోజన్ ప్రణాళికలపై కేంద్రాన్ని ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ

18
0
  • 2050 నాటికి నెట్ జీరో కార్బన్ లక్ష్యాలకు అనుగుణంగా జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌ను విస్తరించే ప్రణాళిక ఉందా?
  • గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ల ఏర్పాటుకు సాధ్యమైన ప్రదేశాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించిందా?
  • లిఖితపూర్వక సమాధానచ్చిన కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద్ యశో నాయక్

న్యూఢిల్లీ ఆర్గాన్ న్యూస్ :

దేశంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి విస్తరణ, ప్లాంట్ల ఏర్పాటు, పర్యావరణ ప్రభావాలపై ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ విస్తరణకు సంబంధించి పలు అంశాలపై వివరాలు కోరారు. దీనికి కేంద్ర విద్యుత్, కొత్త పునరుత్పాక ఇంధనం శాఖల సహాయ మంత్రి శ్రీపాద్ యశో నాయక్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ద్వారా..

భారత్‌ను గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, వినియోగం, ఎగుమతుల్లో ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు.
2030 నాటికి దేశంలో సంవత్సరానికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యంతో చర్యలుకొనసాగుతున్నామని మంత్రి వివరించారు.

SIGHT పథకం ద్వారా ప్రోత్సాహకాలు

‘స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ (SIGHT)’ కార్యక్రమం కింద గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 18 కంపెనీలకు సంవత్సరానికి 8.62 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యానికి అనుమతులు ఇచ్చినట్లు వెల్లడించారు.

గ్రీన్ అమోనియా సరఫరా ప్రణాళిక..

సౌర శక్తి కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI) ద్వారా దేశవ్యాప్తంగా 13 ఎరువుల యూనిట్లకు సరఫరా చేసే విధంగా సంవత్సరానికి 7.24 లక్షల మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించినట్లు తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ లేదా గ్రీన్ అమోనియా ప్లాంట్ల స్థలాల ఎంపిక ఆయా కంపెనీల వాణిజ్య అవసరాల ఆధారంగా జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. పునరుత్పాదక శక్తితో నీటిని ఎలెక్ట్రోలిసిస్ విధానంలో ఉపయోగించి గ్రీన్ హైడ్రోజన్ లేదా గ్రీన్ అమోనియా తయారు చేసే ప్రామాణిక యూనిట్లకు పర్యావరణ ప్రభావ అంచనా నోటిఫికేషన్–2006 ప్రకారం ముందస్తు పర్యావరణ అనుమతి అవసరం లేదని కేంద్ర పర్యావరణ శాఖ స్పష్టం చేసినట్లు తెలిపారు.

జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ప్రధాన లక్ష్యాలు

భారత్‌ను గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, వినియోగం, ఎగుమతుల్లో ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దడం,
2030 నాటికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం, పునరుత్పాదక శక్తి వినియోగం పెంపు, కార్బన్ ఉద్గారాల తగ్గింపు ఉన్నట్లు కేంద్ర సహాయ మంత్రి వివరించారు.