- జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
- 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యాచరణ అమలు ప్రతి శాఖ ప్రాధాన్యతగా తీసుకోవాలి
- పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, 99 రోజుల కార్యాచరణపై సమీక్షించిన జిల్లా కలెక్టర్
ఖమ్మం కలెక్టరేట్, ఆర్గాన్ న్యూస్ , మార్చి 2:
పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం, జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులతో పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, 99 రోజుల ప్రజాపాలన ప్రగతి పాలన కార్యాచరణపై అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి తో కలిసి సమీక్షించారు.
పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై సంపూర్ణ వివరాలను తెలంగాణ నార్త్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎస్ఈ వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ…
పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇంటి పై కప్పుపై సౌర ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే ఇంటి యజమానులకు సబ్సిడీ ఇస్తున్నదని అన్నారు.
సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయడం వల్ల విద్యుత్ ఖర్చు తగ్గడంతో ప్రయోజనం కలుగుతుందని, అవసరమైన వారు www.pmsuryaghar.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.
పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని ప్రోత్సహించడంలో ఈ పథకం ముఖ్య పాత్ర పోషిస్తుందని, ఇంటిపై 1 కిలో వాట్ సోలార్ ప్యానెల్ ఏర్పాటుకు 30 వేల రూపాయలు, 2 కిలో వాట్ ఏర్పాటుకు 60 వేల రూపాయలు, 3 కిలో వాట్ ఏర్పాటుకు 78 వేల రూపాయలు సబ్సిడీ వస్తుందని, మిగిలిన నిధులు బ్యాంకు లోన్ ద్వారా సమకూర్చుకోవచ్చని అన్నారు. ఆసక్తి గల వారు ముందస్తుగానే తమ ఇండ్ల రూఫ్ టాప్ పై సోలార్ ప్యానల్ ఏర్పాటుకు ముందుకు రావాలని కలెక్టర్ తెలిపారు.
ప్రభుత్వం 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యాచరణ అత్యంత కట్టుదిట్టంగా చేపడుతుందని, మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రభుత్వ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక
కార్యాచరణలో మున్సిపల్, పంచాయతీ శాఖలతో పాటు అన్ని శాఖలు ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి అప్ డేట్ వివరాలు ఎప్పటికప్పుడు గూగుల్ షీట్ లో నమోదు చేయాలని అన్నారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కు సంబంధించి పోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో ఎస్డీసి ఎం. రాజేశ్వరి, జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, విద్యుత్ శాఖ ఎస్ఇ శ్రీనివాసా చారి, రెడ్కో జిల్లా మేనేజర్ అజయ్ కుమార్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


