Home జాతీయం వాట్సాప్‌కు సుప్రీం వార్నింగ్ !

వాట్సాప్‌కు సుప్రీం వార్నింగ్ !

29
0
  • వ్యక్తిగత గోప్యత విషయంలో ఆటలొద్దు
  • రాజ్యాంగాన్ని ఫాలో కావాల్సిందే
  • రూల్స్ అమలు చేయకుంటే దేశం విడిచి వెళ్లాల్సిందే!
  • మెటాకు హెచ్చరికలు జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం

ఆర్గాన్ న్యూస్ డిల్లీ:

భారత పౌరుల వ్యక్తిగత గోప్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దేశంలో వ్యాపారం చేయాలంటే భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందేనని, రాజ్యాంగ విలువలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తేల్చిచెప్పింది.

రాజ్యాంగ నిబంధనలను పాటించకపోతే దేశం విడిచి వెళ్లాల్సిందేనని వాట్సాప్ మాతృసంస్థ మెటాకు సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు ఈ రోజు జరిగిన విచారణలో వాట్సాప్ వ్యవహారంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
వ్యక్తిగత గోప్యత ఉల్లంఘనల విషయంలో వాట్సాప్ తీసుకుంటున్న వైఖరిపై కోర్టు ఫైర్ అయింది. వాట్సాప్ యూజర్ల వ్యక్తిగత వివరాలు, డేటాను మెటాతో పంచుకునేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని స్పష్టం చేసింది.
డేటా షేరింగ్, మార్కెట్ ఆధిపత్యానికి సంబంధించిన అంశాలపై గత నెలలో ఎన్సీఎల్టీ (NCLT) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వాట్సాప్, మెటా, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సహా పలువురు దాఖలు చేసిన అప్పీళ్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

సమాచార గోప్యత లేకుంటే – దేశం విడిచి వెళ్లి పోండి

ఈ సందర్భంగా వాట్సాప్‌పై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
“మీరు మా దేశ పౌరుల గోప్యతతో ఆడుకోలేరు. మా డేటాలో ఒక్క అంకెను కూడా పంచుకోవడానికి మేము అనుమతించబోము” అంటూ అమెరికన్ సంస్థ మెటాకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు.
భారత చట్టాలను పాటించలేకపోతే దేశం వదిలి వెళ్లాలని సూచించారు. డేటా షేరింగ్ జరగదని హామీ ఇవ్వాలని, లేకపోతే ఈ కేసును కొట్టివేస్తామని కోర్టు హెచ్చరించింది.
చాట్ ట్రెండ్‌ల ఆధారంగా ప్రకటనలు చూపించడం, వినియోగదారుల డేటా ప్రవర్తనను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించడం వినియోగదారుల హక్కుల ఉల్లంఘనగా సుప్రీంకోర్టు పేర్కొంది.
వైద్యులతో ప్రైవేట్ చాట్‌ల అనంతరం వినియోగదారులకు ఔషధాలకు సంబంధించిన ప్రకటనలు రావడం వంటి ఘటనలను కోర్టు గుర్తు చేసింది. ఇవన్నీ డేటా మానిటైజేషన్ పరిధిలోకి వస్తాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.