Home క్రైమ్ ప్రాణాల రక్షణే లక్ష్యంగా బ్లాక్ స్పాట్లలో ప్రత్యేక చర్యలు

ప్రాణాల రక్షణే లక్ష్యంగా బ్లాక్ స్పాట్లలో ప్రత్యేక చర్యలు

19
0
  • బ్లాక్ స్పాట్ల గుర్తింపు, నివారణ చర్యలపై అధికారులకు కలెక్టర్ ఆదేశాలు కరీంనగర్, ఆర్గాన్ న్యూస్, జనవరి 22:

జిల్లాలో రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణ నష్టం జరగకుండా బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రత్యేక నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆమె స్పష్టం చేశారు.
గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఆర్‌ అండ్‌ బి, పోలీస్‌, రవాణా, ఆర్టీసీ, మున్సిపల్‌ తదితర శాఖల అధికారులతో జిల్లా రోడ్డు భద్రత కమిటీ, జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గత రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలపై ఇప్పటివరకు తీసుకున్న చర్యల వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి, అక్కడ ప్రమాదాల కారణాలను సమగ్రంగా విశ్లేషించి తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రమాదాల అవకాశమున్న ప్రాంతాల్లో హెచ్చరిక సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని, వాహనాల వేగ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్పీడ్ బ్రేకర్లు, రోడ్డు లైటింగ్‌, లేన్ మార్కింగ్స్ వంటి మౌలిక వసతులు కల్పించాలని తెలిపారు.
నేషనల్ హైవే అథారిటీ, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌, పోలీస్‌, రోడ్లు–భవనాలు, రవాణా శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆర్టీసీతో పాటు ప్రైవేట్‌ బస్సుల్లో తప్పనిసరిగా ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్ ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ట్రాఫిక్ నిబంధనలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ, కరీంనగర్–జగిత్యాల రహదారి ఇరువైపులా ఆరు అడుగుల మేర చదును చేయాలని సూచించారు. జిల్లాలో అవసరమైన చోట్ల స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక సైన్ బోర్డులు, లైటింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్ల వివరాలతో పాటు అక్కడ చేపట్టాల్సిన నివారణ చర్యలను వివరించారు.
మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ, గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు నగరంలో అవసరమైన ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు, ట్రాఫిక్ సిగ్నల్స్, సోలార్ లైటింగ్ సిస్టంలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ డైరెక్టర్ కీర్తి భరద్వాజ్ జాతీయ రహదారి 563లో ప్రమాదాల నివారణకు చేపట్టిన చర్యలను వివరించారు.
ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఆర్‌టిఏ సభ్యులు పడాల రాహుల్‌, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ పురుషోత్తం, ఆర్టీసీ డీఎం సునంద, ఏసీపీ వెంకటస్వామి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.