“ఓటే భవితకి బాట”
- ఆడియో సీడీ విడుదల చేసిన కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్, ఆర్గాన్ న్యూస్, డిసెంబర్ 9:
ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు అమూల్యమైందని, ఓటు హక్కును వినియోగించడం ప్రతి పౌరుడి బాధ్యత అని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఓటే భవితకు బాట పేరుతో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు కంసాని ఉదయ, ప్రకృతి ప్రకాష్ నిర్మించిన ఆడియో సీడీని ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి మంగళవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ—
“ఓటు ప్రజల చేతిలో ఉన్న శక్తివంతమైన ఆయుధం. భవిష్యత్తు తరాలకు మంచి పాలన అందించాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటును నమోదు చేయాలి” అని పిలుపునిచ్చారు.
తెలంగాణ సాంస్కృతిక సారథి తరఫున ఈ పాటలను రచించిన రచయిత ప్రకృతి ప్రకాష్, ఆలపించిన కంసాని ఉదయను కలెక్టర్ అభినందించారు. ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన పెంచడంలో ఈ పాటలు ఉపయుక్తమవుతాయని ఆమె అన్నారు.

