Home తెలంగాణ ఫోకస్ లైట్ల మత్తులో రహదారులు… ప్రాణాలపై నిర్లక్ష్యం!

ఫోకస్ లైట్ల మత్తులో రహదారులు… ప్రాణాలపై నిర్లక్ష్యం!

17
0
  • రవాణా శాఖ చూపు మసకబారిందా?
  • లేదా తనిఖీలు కాగితాలకే పరిమితమా? మానకొండూర్, ఆర్గాన్ న్యూస్, జనవరి 17:

రాత్రి రహదారులపై ప్రయాణం అంటే ఇప్పుడు భయం భయంగా మారింది. త్రీ వీలర్లు, ఫోర్ వీలర్లు, గూడ్స్ వాహనాలపై అనుమతి లేని అత్యంత శక్తివంతమైన ఎల్ఈడీ ఫోకస్ లైట్లు యథేచ్ఛగా బిగించి రోడ్లపై దూసుకుపోతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎదురుగా వచ్చే వాహనదారుల కళ్లపై నేరుగా కాంతి పడటంతో క్షణాల్లో చూపు మసకబారిపోతూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఒక్క క్షణం చూపు తప్పినా ప్రమాదం తప్పదు. ఆ ప్రమాదం గాయాలతో ముగుస్తుందా? ప్రాణ నష్టానికి దారి తీస్తుందా? అన్నది అదృష్టం మీదే ఆధారపడి ఉంది. అయినప్పటికీ ఈ ప్రమాదకర పరిస్థితిపై రవాణా శాఖ అధికారులు చూస్తూ చూడనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
లైట్లు ఎక్కువైతే భద్రత పెరుగుతుందన్న అపోహతో కొందరు వాహనదారులు చట్టాన్ని పట్టించుకోకుండా ఎక్స్‌ట్రా ఫోకస్ లైట్లు అమర్చుకుంటున్నారు. ఇది చట్ట విరుద్ధమని తెలిసినా చర్యలు తీసుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారుతోంది. రవాణా చట్టాలు పుస్తకాల్లో మాత్రమే ఉన్నాయా? అన్న ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతోంది.
ఎక్స్‌ట్రా ఫిటింగ్ లైట్లతో వాహనాలు రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతున్నా తనిఖీలు మాత్రం అరుదుగా కనిపిస్తున్నాయి. జరిగితే ఫోటోలు, ఫైళ్ల వరకే పరిమితం అవుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా ప్రతి వాహనం ఒక ప్రమాదకర ఆయుధంలా మారుతోంది.
ఈ ఫోకస్ లైట్ల ప్రభావంతో ఎక్కువగా నష్టపోతున్నవారు ద్విచక్ర వాహనదారులు, పాదచారులే. చూపు మసకబారి దారి కనిపించక ప్రమాదం జరిగితే దానిని సాధారణ రోడ్డు ప్రమాదంగా నమోదు చేసి సరిపెట్టడం అధికారుల బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నిస్తోంది.
ఇదే సమయంలో రోడ్డు భద్రత పేరుతో ప్రభుత్వం మాసోత్సవాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వేదికలపై భద్రతపై ఉపన్యాసాలు సాగుతుంటే, రహదారులపై మాత్రం చట్ట విరుద్ధమైన ఫోకస్ లైట్లు యథేచ్ఛగా వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆ కార్యక్రమాల ప్రయోజనం ఏమిటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన రవాణా శాఖ ఇకనైనా అప్రమత్తం కావాలని వాహనదారులు కోరుతున్నారు. అనుమతి లేని ఎల్ఈడీ ఫోకస్ లైట్లపై ప్రత్యేక తనిఖీలు, కఠిన చర్యలు, భారీ జరిమానాలు విధించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. లేనిపక్షంలో రోడ్లపై జరిగే ప్రతి ప్రమాదానికి సంబంధిత శాఖే బాధ్యత వహించాల్సి ఉంటుందన్న ఆవేదన వ్యక్తమవుతోంది.
ఫోకస్ లైట్లను కాదు…
ముందుగా రవాణా శాఖ తన చూపును సరిచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.