- మంత్రి తుమ్మల నాగేశ్వరావు
- ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నాగండ్ల దీపక్ బాధ్యతల స్వీకారం
- పార్టీలో ఉంటూ వెన్నుపోటు పొడిచే నేతలపై నిఘా ఉంచాలి
- సీఎం రేవంత్ రెడ్డి ‘ప్రజా పాలన’కు పంచాయతీ ఫలితాలే నిదర్శనం
ఖమ్మం, డిసెంబర్ 20 (ఆర్గాన్ ప్రతినిధి):
ఉపాధి హామీ పథకం నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించడం బీజేపీ ప్రభుత్వం చేసిన అక్షరాలా దేశద్రోహమేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. తుపాకీ తూటాలకు బలై ‘హే రామ్’ అంటూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడి పేరును తొలగించే హక్కు ఎవరికీ లేదన్నారు. శనివారం ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నాగండ్ల దీపక్ చౌదరి పదవీ స్వీకారోత్సవ కార్యక్రమానికి మంత్రి తుమ్మల ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
బీజేపీని జిల్లా పొలిమేరల దాటించిన ప్రజలకు ధన్యవాదాలు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క గ్రామ పంచాయతీలో కూడా బీజేపీని గెలిపించకుండా స్పష్టమైన తీర్పునిచ్చిన జిల్లా ప్రజలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. “అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ నుండి ఏమి ఆశించారో, ఆ ఆశయాలకు అనుగుణంగానే నేడు ప్రజా పాలన సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వానికి మద్దతుగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారు” అని ఆయన పేర్కొన్నారు.
కోవర్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
పార్టీలో ఉంటూ, పదవులు అనుభవిస్తూ కాంగ్రెస్‌కు నష్టం చేసే నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి కార్యకర్తలకు సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొందరు నేతల వైఖరి వల్ల కొన్ని గ్రామాల్లో ఆశించిన ఫలితాలు రాలేదని అసహనం వ్యక్తం చేశారు. పార్టీ కోసం చిత్తశుద్ధితో కష్టపడే వారికే భవిష్యత్తులో తగిన ప్రాధాన్యత ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
అరాచకాలకు తావులేని ఖమ్మం
గతంలో ఖమ్మంలో ఉన్న అరాచకాలు, అవినీతి, వేధింపు రాజకీయాలకు స్వస్తి పలికి, నేడు ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పడమే తమ లక్ష్యమని తుమ్మల అన్నారు. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాగండ్ల దీపక్ చౌదరి నగరంలో పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్పొరేటర్లు, భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.








