Home తెలంగాణ ఎస్సారెస్పీ మొరం మాయం

ఎస్సారెస్పీ మొరం మాయం

75
0
  • జోరుగా రాత్రిళ్లు అక్రమ తవ్వకాలు మానకొండూర్, ఆర్గాన్ న్యూస్, మార్చి 21:

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని ముంజంపల్లి, ఈదులగట్టుపల్లి గ్రామాల పరిసరాల్లో ఎస్సారెస్పీకి చెందిన మొరం అక్రమంగా తరలిపోతుండడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. గ్రామాల శివారులో కాకతీయ పెద్ద కాలువ తవ్వకాల సమయంలో తీసిన మట్టిని గతంలో పెద్ద ఎత్తున కుప్పలుగా పోశారు. కాలక్రమేణా అవి గుట్టలుగా మారి, వాటిపై చెట్లు పెరిగి సహజ వనరులుగా మారాయి.
అయితే ఇటీవల కొద్ది రోజులుగా ఈ గుట్టలపై అక్రమ తవ్వకాలు తీవ్రరూపం దాల్చాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రోక్లైన్ యంత్రాలను వినియోగించి గుట్టలను తవ్వుతూ, ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పగటి వేళల్లో ఎలాంటి కదలికలు లేకపోయినా, రాత్రి పడగానే అక్రమ తవ్వకాల మోత మోగుతోందని చెబుతున్నారు.
ఈ మట్టిని పలువురు ట్రాక్టర్ యజమానులు యథేచ్ఛగా కరీంనగర్, మానకొండూరు ప్రాంతాలకు తరలిస్తూ, ఇళ్ల నిర్మాణాలు, పెద్ద భవనాల పనులకు వినియోగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని సమాచారం. ఒక్కో ట్రాక్టర్ మట్టి లోడ్‌కు వేల రూపాయలు వసూలు చేస్తుండగా, రోజుకు పదుల సంఖ్యలో లోడ్లు తరలిపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో లక్షల రూపాయల విలువైన మొరం అక్రమంగా మాయం అవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముంజంపల్లి శివారులోని గుట్ట ప్రాంతాలు పూర్తిగా ఖాళీ అవుతున్నాయని, ఈ అక్రమ తవ్వకాల వల్ల పర్యావరణానికి కూడా ముప్పు వాటిల్లుతోందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెట్లు నరికివేయడం, నేల తక్కువవడం వల్ల భవిష్యత్తులో మట్టి ధూళి సమస్యలు, భూసారం తగ్గుదల వంటి సమస్యలు తలెత్తే అవకాశముందని పేర్కొంటున్నారు.
ఇంత పెద్ద ఎత్తున అక్రమ రవాణా జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖల నిర్లక్ష్యం కారణంగా చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొందరు ప్రభావశీలుల అండతోనే ఈ మట్టి దందా సాగుతోందని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై స్పందించిన ఎస్సారెస్పీ ఏఈ శ్రీనివాస్ మాట్లాడుతూ, మట్టిని అక్రమంగా తరలించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో పలు ట్రాక్టర్లను పట్టుకుని సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఇకపై రాత్రి వేళల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని వాహనాలను పట్టుకుని సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.
అయితే అధికారులు మాటలు మాత్రమే కాకుండా కఠిన చర్యలు తీసుకుని అక్రమ తవ్వకాలను పూర్తిగా అరికట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఎస్సారెస్పీ మొరం పూర్తిగా మాయం కావడంతో పాటు ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.