Home Adyatmikam వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తాం

వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తాం

21
0
  • మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్, ఆర్గాన్ న్యూస్, జనవరి 12:

కరీంనగర్ మార్కెట్ రోడ్డులోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ ఏడాది మరింత వైభవంగా నిర్వహిస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈనెల 23 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సోమవారం ఆలయ ప్రాంగణంలో సన్నాహక సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. రాజకీయాలకు అతీతంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, పార్టీలతో సంబంధం లేకుండా ప్రజాప్రతినిధులందరూ పాల్గొనాలని కోరారు. గతేడాది మాదిరిగానే స్వామివారి సేవకు ముందుకు వచ్చి విరాళాలు అందిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్సవాల సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు ఆలయ అధికారులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నిరంతర విద్యుత్ సరఫరా, వైద్య శిబిరాల ఏర్పాటు, శానిటేషన్, పారిశుధ్య పనులు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా పలువురు దాతలు బ్రహ్మోత్సవాల నిర్వహణకు విరాళాలు ప్రకటించారు.
ఈ సమావేశంలో ఆర్డీవో మహేశ్వర్, కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్రె రాజశేఖర్, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఆలయ చైర్మన్లు చకిలం శ్రీనివాస్, చకిలం గంగాధర్, ఏసీపీ వెంకటస్వామి, ఈవో సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.