Home తెలంగాణ హుజురాబాద్ ఎంఈఓపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

హుజురాబాద్ ఎంఈఓపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

14
0
  • విద్యార్థుల హక్కులను హరించారని ఆరోపణలు
  • బోధనేతర పనులకు గణిత ఉపాధ్యాయుడు
  • పేద విద్యార్థులకు అన్యాయం హుజురాబాద్, ఆర్గాన్ న్యూస్, డిసెంబర్ 20:

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండల విద్యాధికారి (ఎంఈఓ)పై మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్‌సీ)కు రిజిస్టర్ పోస్టు ద్వారా ఫిర్యాదు చేసినట్లు ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ మెంబర్ కొలుగూరి సూర్య కిరణ్ తెలిపారు. విద్యార్థుల విద్యా హక్కులను కాలరాస్తూ ఎంఈఓ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు.
ఈ సందర్భంగా సూర్య కిరణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు గణితం బోధించాల్సిన ఉపాధ్యాయుడు గోపాల్ రెడ్డిని ఎంఈఓ తన కార్యాలయ పనుల కోసం వినియోగించుకుంటూ, తరగతుల నుంచి దూరం చేశారని మండిపడ్డారు. దీని వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు కీలకమైన గణిత బోధన కోల్పోయారని, ఇది నేరుగా విద్యార్థుల హక్కుల హరణేనని విమర్శించారు.

ప్రజావాణికి ఫిర్యాదు చర్యలేవీ లేవు

ఈ అంశంపై ఇప్పటికే కరీంనగర్ జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని సూర్య కిరణ్ తెలిపారు. ప్రజావాణి వ్యవస్థ లక్ష్యం నీరుగారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (పాఠశాల విద్య) వరంగల్‌కు, పాఠశాల విద్య కమిషనర్‌-డైరెక్టర్‌కు ఫిర్యాదులు పంపినప్పటికీ స్పందన లేదని పేర్కొన్నారు.

సస్పెన్షన్‌కు డిమాండ్

తక్షణమే హుజురాబాద్ ఎంఈఓను, అలాగే పాఠాలు బోధించకుండా జీతాలు పొందిన గణిత ఉపాధ్యాయుడు గోపాల్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇరువురిపై చర్యలు తీసుకునే వరకు రాజీలేని పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.

న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా

ఈ విషయంలో సంబంధిత అధికారులు స్పందించకపోతే త్వరలోనే న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయిస్తామని కొలుగూరి సూర్య కిరణ్ స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం అనుమతించబోమని ఆయన తేల్చిచెప్పారు.