- కన్న తండ్రి చేతిలో కుమారుడు హత్య మానకొండూర్, ఆర్గాన్ న్యూస్, ఫిబ్రవరి 17:
కరీంనగర్ జిల్లా మానకొండూరులో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల నేపథ్యంలో కన్న తండ్రే తన కుమారుడిని హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
మంగళవారం ఉదయం పూరం కనకయ్య అనే వ్యక్తి స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన కుమారుడు పూరం శ్రీనివాస్ (35)ను తానే హత్య చేసినట్లు ఒప్పుకోవడం సంచలనం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడ శ్రీనివాస్ తలపై తీవ్ర గాయాలతో మృతదేహంగా కనిపించాడు.
పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసిన వివరాల ప్రకారం, శ్రీనివాస్‌కు వివాహం కాలేదు. అతడు తరచూ మద్యం సేవించి ఇంటికి వచ్చి తండ్రితో గొడవపడేవాడని, దీంతో ఇంట్లో తరచూ వాగ్వాదాలు చోటుచేసుకునేవని తెలిసింది. సోమవారం రాత్రి కూడా మద్యం సేవించి వచ్చి తండ్రితో తీవ్ర వాగ్వాదానికి దిగినట్లు సమాచారం.
రాత్రి సమయంలో నిద్రలో ఉన్న శ్రీనివాస్‌పై ఇంటి పక్కన ఉన్న బండరాయితో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.








