Home తెలంగాణ మహిళల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి

మహిళల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి

16
0
  • అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే కరీంనగర్, ఆర్గాన్ న్యూస్, ఫిబ్రవరి 25:

మహిళల నుంచి వచ్చే ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆదేశించారు. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిర్మూలన చట్టం–2013పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.
బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారిత కేంద్రం ద్వారా పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిర్మూలన చట్టం–2013పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోకల్ కమిటీ సభ్యుడు రాజా రెడ్డి చట్టంలోని ముఖ్యాంశాలను వివరించారు. మహిళల రక్షణకు ఈ చట్టం ఎంత కీలకమో వివరిస్తూ, లైంగిక వేధింపుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫిర్యాదుల స్వీకరణ విధానం, పరిష్కార చర్యలపై సమగ్ర అవగాహన కల్పించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ, జిల్లాలో మండల స్థాయిలో ఎంపీడీవోలు నోడల్ అధికారులుగా, మున్సిపల్ పరిధిలో మున్సిపల్ కమిషనర్లు నోడల్ అధికారులుగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి కార్యాలయంలో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలు (ఐసీసీ) ఏర్పాటు చేసి, మహిళల ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలన్నారు.
పని ప్రదేశాల్లో మహిళలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో పనిచేయడానికి అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె పేర్కొన్నారు. చట్టంపై ఉన్న సందేహాలను నోడల్ అధికారులు అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎం. సరస్వతి, మున్సిపల్ కమిషనర్లు, సిడిపిఓలు, ఎంపీడీవోలు తదితర అధికారులు పాల్గొన్నారు