- ఎల్‌టిఆర్ జడ్జిమెంట్ మేరకు నోటీసులు
ములుగు జిల్లా, ఆర్గాన్ న్యూస్, డిసెంబర్ 5:
ములుగు జిల్లా షెడ్యూల్ ఏరియాలోని మంగపేట మండలం పద్మూర్ రెవెన్యూ గ్రామంలో గిరిజనుల పట్టా భూమిపై జరుగుతున్న అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు నిలిపివేశారు. ఎల్‌టిఆర్ (LTR) జడ్జిమెంట్ ప్రకారం గిరిజనేతరులకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
పట్టా రికార్డుల ప్రకారం ముక్తి పాపయ్య, ముక్తి పొట్టి, ముక్తి రాములు పేర్లలో సర్వే నంబర్ 95లో 0.24 గుంటలు, సర్వే నంబర్ 96లో 1.35 గుంటల భూమి ఉంది. అయితే గిరిజనేతరులు కళ్లబోయిన కోమరయ్య, కళ్లబోయిన శ్రీను ఈ భూమిని కబ్జా చేసి, గిరిజనులకు తెలియకుండా షెడ్యూల్ ఏరియాకు సంబంధించిన 1/59, 1/70, పీసా చట్టాలకి విరుద్ధంగా ఎండి హుస్సేన్ అనే మరో గిరిజనేతరుడికి విక్రయించారు.
ఈ భూమిపై ఎండి హుస్సేన్ ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించగా, అసలు వారసులైన ఆదివాసీ కుటుంబానికి చెందిన ముక్తి రాములు, ముక్తి లక్ష్మి ఇది తమ పూర్వీకుల పట్టా భూమి అని పునరావృతంగా తెలియజేశారు. అయినప్పటికీ డబ్బు, రాజకీయ మద్దతుతో అక్రమ నిర్మాణం కొనసాగించారని వారు ఆరోపించారు.
దీంతో బాధితులు ఏటూరునాగారం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌ను ఆశ్రయించగా, షెడ్యూల్ ఏరియాలో గిరిజనేతరుల భూబదలాయింపులు చట్ట విరుద్ధమని గుర్తించి ఎల్‌టిఆర్ నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేశారు. ఎల్‌టిఆర్ కేసు నం. ఎ/04/ఎల్‌టిఆర్/ఎంఎన్‌పీటి/2025 గా ట్రైబల్ కోర్టులో నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.
కేసు పెండింగ్‌లో ఉన్నందున సంబంధిత స్థలంలో ఎవరూ పనులు కొనసాగించరాదని హెచ్చరికగా రెవెన్యూ అధికారులు ఫ్లెక్సీ బోర్డు ఏర్పాటు చేశారు.
షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజన భూహక్కులను రక్షించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.


