Home తెలంగాణ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి ఫిర్యాదు సంచలనం

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి ఫిర్యాదు సంచలనం

14
0
  • స్నేహం పేరుతో దగ్గరై.. పెళ్లి ఒత్తిడి, రూ.5 కోట్ల డిమాండ్‌ చేశారంటూ ఆరోపణలు కరీంనగర్, ఆర్గాన్ న్యూస్, మే 9:

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి సాయి భగీరథ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కరీంనగర్ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేయడం జిల్లాలో సంచలనంగా మారింది. స్నేహం పేరుతో పరిచయం పెంచుకుని… అనంతరం పెళ్లి కోసం ఒత్తిడి తీసుకువచ్చి, భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డారంటూ హైదరాబాద్‌కు చెందిన కుటుంబ సభ్యులపై భగీరథ్ ఫిర్యాదు చేశారు.
పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. ఓ ఉమ్మడి స్నేహితుడి ద్వారా ఒక కుటుంబంతో పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత వారు కుటుంబ స్నేహితులుగా మారారని భగీరథ్ పేర్కొన్నారు. తమ కుటుంబ కార్యక్రమాలు, స్నేహితుల సమావేశాలు, ఆధ్యాత్మిక యాత్రలకు కూడా తీసుకెళ్లి నమ్మకం కల్పించారని తెలిపారు. విజయవాడ, అరుణాచలం, తిరుమల వంటి ప్రాంతాలకు కలిసి వెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే కొంతకాలం తర్వాత పరిస్థితులు మారిపోయాయని… తమ కుమార్తెను వివాహం చేసుకోవాలని తనపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. తాను నిరాకరించడంతో తనపై తప్పుడు కేసులు పెడతామని, వేధింపులు, శారీరక సంబంధాల పేరుతో ఆరోపణలు చేస్తామని బెదిరించారని ఫిర్యాదులో వివరించారు.
ఈ వ్యవహారంలో ఖర్చులకు సంబంధించిన విషయాలను పరిగణనలోకి తీసుకుంటూ రూ.50 వేల రూపాయలు చెల్లించినట్లు భగీరథ్ పేర్కొన్నారు. అయినప్పటికీ వేధింపులు ఆగలేదని… మరింత ఒత్తిడి పెంచారని ఆరోపించారు.
ఇక తమకు రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొనడం చర్చనీయాంశమైంది. ఈ చర్యలతో తాను తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నానని భగీరథ్ పోలీసులకు వివరించారు.
ఈ కేసులో మరో కీలక అంశం కూడా వెలుగులోకి వచ్చింది. ఇలాంటి సమస్యనే తన స్నేహితుల్లో మరికొందరు ఎదుర్కొన్నారని… ఇప్పటికే నిర్మల్ పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు నమోదైందని భగీరథ్ తన కంప్లైంట్‌లో ప్రస్తావించారు. దీంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని మరింత సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది వ్యక్తిగత వివాదమా..? లేక ప్రణాళికాబద్ధంగా బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్న ముఠా వ్యవహారమా..? అన్న కోణాల్లో విచారణ సాగిస్తున్నట్లు సమాచారం.
పలు సెక్షన్ల కింద కేసు నమోదు
భగీరథ్ ఫిర్యాదు మేరకు కరీంనగర్ టూ టౌన్ పోలీసులు క్రైమ్ నంబర్ 253/2026గా కేసు నమోదు చేశారు. బీఎన్‌ఎస్ సెక్షన్లు 308(5), 351(2), 61(2), 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఫిర్యాదులో పేర్కొన్న వ్యక్తుల కాల్ డేటా, ఆర్థిక లావాదేవీలు, ప్రయాణ వివరాలు, ఇతర సాక్ష్యాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సంబంధిత వ్యక్తులను విచారించే అవకాశమున్నట్లు సమాచారం.
కేంద్ర మంత్రి కుమారుడి ఫిర్యాదుతో నమోదైన ఈ కేసు ప్రస్తుతం కరీంనగర్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. స్నేహం, కుటుంబ సంబంధాలు, ఆధ్యాత్మిక యాత్రలతో ప్రారంభమైన పరిచయం… ఇప్పుడు పోలీస్ కేసు దాకా వెళ్లడం చర్చనీయాంశమైంది. మొత్తంగా ఈ వ్యవహారం వెనుక అసలు నిజాలు ఏమిటి..? ఆరోపణల్లో ఎంతవరకు వాస్తవం ఉంది..? డబ్బు డిమాండ్‌, బెదిరింపుల ఆరోపణలపై పోలీసులు ఎలాంటి ఆధారాలు సేకరిస్తారు..? అన్నది ఆసక్తికరంగా మారింది.